కొత్తగూడెం 3టౌన్ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఇరువర్గాల మధ్య ఘర్షణ

25-09-2026 | 08:43pm

పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన ఇరువర్గాలపై కేసులు – అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలింపు

భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 25, (విజయక్రాంతి): గణేష్ నిమజ్జన(Ganesh immersion) బందోబస్తు విధుల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసు సిబ్బంది నిమగ్నమై ఉన్న సమయంలో, శుక్రవారం కొత్తగూడెం 3  టౌన్ పోలీస్ స్టేషన్(Police Station) ఆవరణలో కుటుంబ వివాదానికి సంబంధించి పోలీస్ స్టేషన్‌కు వచ్చిన ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. పరస్పరం దూషించుకోవడంతో పాటు దాడులకు పాల్పడటమే కాకుండా, విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందిని నెట్టివేసి వారి విధులకు ఆటంకం కలిగించిన ఘటనపై పోలీసులు చట్టపరమైన చర్యలు చేపట్టారు.

కొరదల కుమార్ అతని భార్య వినోదకు సంబంధించిన కుటుంబ వివాదం నేపథ్యంలో ఇరువర్గాల వారు కొత్తగూడెం పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. ఈ క్రమంలో మాటామాట పెరిగి పరస్పరం దూషించుకోవడంతో పాటు ఒకరిపై ఒకరు  దాడులకు పాల్పడ్డారు.  ఈ ఘటనలో దున్నపోతుల రాజు అనే వ్యక్తిపై ఇటుక/రాయితో దాడి చేయడంతో ముక్కుపై రక్తగాయం అయినట్లు ఫిర్యాదు అందింది.  వెంకటమల్లు అనే మహిళను కొంతమంది వ్యక్తులు జుట్టు పట్టుకుని, చేతులతో కొట్టినట్లు మరో ఫిర్యాదు అందింది. ఇరువర్గాల మధ్య పరస్పరం బెదిరింపులు, దూషణలు జరిగినట్లు ఫిర్యాదుల్లో పేర్కొన్నారు.

ఘర్షణను అదుపు చేసే క్రమంలో విధులు నిర్వహిస్తున్న పోలీసు అధికారులను సైతం ఇరువర్గాల వారు నెట్టివేసి, పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో వారి విధులకు ఆటంకం కలిగించడం జరిగింది. ఈ ఘటనపై అందిన ఫిర్యాదుల మేరకు కేసులు నమోదు చేసి, సంబంధిత వ్యక్తులను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసి, న్యాయస్థానంలో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. ఈ సందర్భంగా కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ మాట్లాడుతూ, పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించడం, విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందికి ఆటంకం కలిగించడం వంటి చర్యలను తీవ్రంగా పరిగణిస్తామని తెలిపారు. చట్టాన్ని అతిక్రమించే వారిపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు