ప్రభుత్వ ఆసుపత్రి వ్యవహారంపై సూపరింటెండెంట్ సీరియస్
అసలేం జరుగుతుంది...? కథనానికి స్పందన...!
వైద్యులు, సిబ్బందికి స్పష్టమైన హెచ్చరికలు..!
విజయక్రాంతి కథనంపై సూపరింటెండెంట్‌ను ఆరా తీసిన మున్సిపల్ వైస్‌చైర్మన్
ప్రైవేటు అంబులెన్స్‌లపై ఉక్కుపాదం మోపుతాం
డ్యూటీ వైద్యుల రిఫర్లపై నిఘా
బాన్సువాడ ఆసుపత్రి సూపరిండెంట్ శ్రీనివాస్ వెల్లడి
బాన్సువాడ,(విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా(Kamareddy District) బాన్సువాడ పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో నెలకొన్న పరిస్థితులపై వెలువడిన ‘అసలేం జరుగుతుంది...?’ కథనానికి అధికారులు స్పందించారు. విజయక్రాంతిలో ప్రచురితమైన కథనంపై ఆసుపత్రి సూపరింటెండెంట్ వైద్యులు, సిబ్బందితో సీరియస్‌గా ఆదేశాలు జారీ చేశారు. విజయ క్రాంతి కథనం నేపథ్యంలో మున్సిపల్ వైస్ చైర్మన్ రేష్మ బేగం(Municipal Vice Chairman Reshma Begum) ఎజాజ్ ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రీనివాస్ ను కలిసి పరిస్థితులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలని, ప్రైవేటు ఆసుపత్రులు, అంబులెన్స్‌ల వ్యవహారంలో నిబంధనలు ఉల్లంఘించకుండా పర్యవేక్షించాలని సూచించినట్లు తెలిసింది. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులను ప్రైవేటు అంబులెన్స్‌ల వైపు మళ్లించే పరిస్థితులు తలెత్తితే కఠినంగా వ్యవహరిస్తామని సూపరింటెండెంట్ హెచ్చరించారు. ఆసుపత్రి ప్రాంగణంలో ప్రైవేటు అంబులెన్స్‌ల కార్యకలాపాలపై ప్రత్యేకంగా దృష్టి సారించనున్నట్లు తెలిపారు. ప్రైవేట్ అంబులెన్స్ డ్రైవర్లు ఆసుపత్రి ఆవరణలోకి రాకుండా ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
డ్యూటీ వైద్యులు రోగులను ప్రైవేటు ఆసుపత్రులకు రిఫర్ చేస్తున్నారనే ఫిర్యాదులు వస్తే వాటిని పరిశీలించి, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్లు తేలితే చర్యలు తీసుకుంటామని సూపరింటెండెంట్ స్పష్టం చేశారు. ప్రతి రిఫర్ ను నిజామాబాద్, కామారెడ్డి జిల్లా కేంద్రాలలోని ప్రభుత్వ ఆసుపత్రులకు మాత్రమే రిఫర్ ఉండేలా చూడాలని వైద్యులకు సూచించారు.రోగుల ప్రయోజనాలే ప్రధానంగా పనిచేయాలని, ప్రభుత్వ ఆసుపత్రిపై ప్రజలకు నమ్మకం పెరిగేలా వైద్యులు, సిబ్బంది బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని సూపరింటెండెంట్ ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావతం కాకుండా చూడాలని మరోసారి పునరావృతమైతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.