సాయి చరణ్ వైద్య విద్యకు అండగా ఉంటాం

21-10-2026 | 08:02pm

ముందుకు వచ్చిన గాంధీ మెడికల్ కళాశాల పూర్వ విద్యార్థులు.

బోథ్. అక్టోబర్ 21 (విజయక్రాంతి): మండల కేంద్రంలోని సాయి నగర్ కాలనీకి చెందిన నిరుపేద విద్యార్థి సాయి చరణ్ వైద్య విద్య పూర్తయ్యేంతవరకు బాధ్యత తీసుకుంటామని గాంధీ మెడికల్ కళాశాల(Gandhi Medical College) పూర్వ విద్యార్థులు పేర్కొన్నారు. బోథ్ సిహెచ్సి ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ రవీంద్ర ప్రసాద్ సాయి చరణ్ ఆర్థిక పరిస్థితిని గమనించి గాంధీ వైద్య కళాశాల పూర్వ విద్యార్థులు డాక్టర్ రోహిణి వంగ, విక్రమ్ రెడ్డిలకు వివరించారు. స్పందించిన పూర్వ విద్యార్థులు తాము సాయిచరణ్ వైద్య విద్యకు అయ్యే ఖర్చును భరిస్తామని ముందుకు రావడం జరిగింది.

ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించేందుకు ముందుకు వచ్చారు. అంతేగాక మండల కేంద్రంలోని సాయినగర్ కాలనీలో ఉన్న దుర్గామాత ఆలయం శారదా దేవి విగ్రహం వద్ద విద్యార్థికి 50 వేల రూపాయల చెక్కును అందించారు. ఈ సందర్భంగా మాజీ జెడ్పిటిసి సంధ్యారాణి డాక్టర్ రవీంద్ర ప్రసాద్ మాట్లాడుతూ పేద విద్యార్థి సాయి చరణ్ వైద్య విద్యను పూర్తి చేసేందుకు తామంతా అండగా ఉంటామని పేర్కొన్నారు. విద్యార్థి చదువులకు ముందుకు వచ్చిన పూర్వ విద్యార్థులకు సాయి చరణ్ తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. మీరిచ్చే సహకారాన్ని మేము మర్చిపోలేమంటూ భావోద్వేగానికి గురయ్యారు. కార్యక్రమంలో ప్రభుత్వ రిటైర్డ్ ఉపాధ్యాయులతో పాటు బుడగ జంగం కుల పెద్దలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు