అపూర్వ కలయిక.. ఆత్మీయ బంధాల వేదిక

21-10-2026 | 08:16pm

* ఖమ్మంలో ఘనంగా గడల వంశీయుల సమ్మేళనం.

*  ప్రజాసేవలో రాణించేందుకు ఆశీర్వదించాలని డాక్టర్ గడల శ్రీనివాసరావు పిలుపు.

ఖమ్మం, అక్టోబర్ 21(విజయక్రాంతి): ఎక్కడా జరగని విధంగా రక్తసంబంధాలు, అనుబంధాలకు పెద్దపీట వేస్తూ గడల వంశీయులు, వారి ఆడబిడ్డల కుటుంబాల ఆత్మీయ కలయిక బుధవారం ఖమ్మంలో(Khammam) అత్యంత వైభవంగా జరిగింది. సుమారు 50 ఏళ్ల తర్వాత ఒకే వేదికపై కలుసుకున్న వంశీయులు, ఆడబిడ్డలు ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. ఈ కార్యక్రమానికి మాజీ హెల్త్ డైరెక్టర్, ఖమ్మం, వరంగల్, నల్గొండ ఉమ్మడి జిల్లాల జనసేన పార్టీ(Jana Sena Party) అభ్యర్థి డాక్టర్ గడల శ్రీనివాసరావు(Gadala Srinivas Rao) ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.

గడల  పెద్దల ఆలోచనలతో రూపుదిద్దుకున్న ఈ సమ్మేళనానికి కేవలం స్థానికులే కాకుండా ముంబై, హైదరాబాద్, బెంగుళూరు , చెన్నై వంటి సుదూర ప్రాంతాల్లో స్థిరపడిన గడల వంశీయులు సైతం తరలివచ్చారు. దాదాపు ఏడు తరాల చరిత్ర కలిగిన గడల వంశం తమ మూలాలను మర్చిపోకుండా, భవిష్యత్ తరాలకు తమ బంధుత్వాలను పరిచయం చేసేలా ఈ వేడుకను నిర్వహించుకున్నారు. సాధారణంగా వంశ వృక్షం అంటే కేవలం మగవారి పేర్లతోనే ఉంటుందని, కానీ ఇంటికి దీపంలా వెలుగునిచ్చే ఆడబిడ్డలను, వారి కుటుంబాలను కలుపుకొని ఇలాంటి వేడుక నిర్వహించడం చరిత్రలో నిలిచిపోతుందని వక్తలు కొనియాడారు..

ఈ సందర్భంగా ముఖ్య అతిథి డాక్టర్ గడల శ్రీనివాసరావు మాట్లాడుతూ తమ వంశం తరతరాలుగా సమాజ సేవలో ముందుందని గుర్తుచేశారు. 80 ఏళ్ల క్రితమే తమ పూర్వీకులు దేవాలయాల నిర్మాణానికి కృషి చేశారని, ముత్యాలమ్మ గుడి, శివాలయం, శ్రీరామనవమి ఉత్సవ కమిటీలలో గడల వంశీయుల పాత్ర మరువలేనిదని తెలిపారు. సమాజంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆదుకోవడం తమ ఇంటి సంప్రదాయమని, కరోనా కష్టకాలంలో వేలాది మందికి వైద్య సహాయం అందించే అవకాశం ఆ భగవంతుడు తనకు కల్పించాడని పేర్కొన్నారు.

 ఈ కార్యక్రమం ఆద్యంతం ఆటపాటలు, పాత జ్ఞాపకాల నెమరువేతలతో, కుటుంబ సభ్యుల ఆనంద భాష్పాలతో ఒక పండుగ వాతావరణాన్ని తలపించింది. కార్యక్రమ నిర్వాహకులకు, వంటకాలు సిద్ధం చేసిన వారికి, వేదికను అలంకరించిన ప్రతి ఒక్కరికీ శ్రీనివాసరావు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

మరిన్ని వార్తలు