దుద్దెడలో ఘనంగా దుర్గామాత శోభాయాత్ర

21-10-2026 | 08:07pm

కన్నుల పండువగా అమ్మవారి నిమజ్జన వేడుకలు

కొండపాక, అక్టోబర్ 21 (విజయక్రాంతి): దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కొండపాక మండలం(Kondapaka Mandal) దుద్దెడ గ్రామంలోని శంభూ దేవాలయం వద్ద ఉషోదయ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన దుర్గామాత శోభాయాత్ర వైభవంగా సాగింది. నవరాత్రుల సందర్భంగా విశేష పూజలు అందుకున్న అమ్మవారిని బుధవారం భక్తిశ్రద్ధలతో నిమజ్జనం చేశారు.

శోభాయాత్రలో వివిధ దేవతామూర్తుల ఘటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కళాకారుల నృత్య ప్రదర్శనలు, గ్రామ బాలబాలికల సాంస్కృతిక కార్యక్రమాలు, మహిళల కోలాటాలతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి భక్తిపూర్వకంగా వీడ్కోలు పలికారు.

ఈ సందర్భంగా ఉషోదయ యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు గూడెం శంకర్, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు తిరుమల రవి మాట్లాడుతూ.. అమ్మవారి కృపతో దాతలు, గ్రామ పెద్దలు, భక్తుల సహకారంతో నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించామని తెలిపారు. ఉత్సవాల నిర్వహణకు సహకరించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేశారు.

నిమజ్జనం సందర్భంగా నిర్వహించిన అన్నప్రసాద వితరణకు, శోభాయాత్ర ప్రసాదానికి గ్రామ సర్పంచ్ మిద్దె శివకుమార్ దాతగా వ్యవహరించారని పేర్కొన్నారు. సహకారం అందించిన సర్పంచ్‌కు ఉషోదయ మిత్ర బృందం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు కాసాని మహేందర్ రెడ్డి, గున్నాల కిషోర్, ఉత్సవ కమిటీ సభ్యులు మేర్గు శ్రీనివాస్, తలారి యాదగిరి, గున్నాల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు