జంతు ప్రేమికుడు కనకం మైసయ్య మృతి
* మూగజీవాలపై మమకారం.. కన్నీటి వీడ్కోలుతో అంతిమయాత్ర
* మతాలకు అతీతంగా పాడె మోసిన చిన్ననాటి స్నేహితులు
* మైసయ్య మృతికి పలు రాజకీయ పార్టీల నాయకుల నివాళులు
కూసుమంచి, అక్టోబర్ 21(విజయక్రాంతి): మూగజీవాల ఆకలి తీర్చడంలోనే ఆనందాన్ని వెతుక్కున్న ఆ జంతు ప్రేమికుడు(Animal lover) ఇక లేరు. బాల్యం నుంచే శునకాలపై(Dogs) అపారమైన మమకారం పెంచుకుని, ఇంట్లో పెంచుకునే శునకాలతో(Dogs) పాటు వీధుల్లో తిరిగే శునకాలకు సైతం సొంత ఖర్చులతో ఆహారం అందించిన కూసుమంచి మండల(Kusumanchi Mandal) కేంద్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కనకం మైసయ్య(Kanakam Maisayya) (54) అలియాస్ మైసన్న కన్నుమూశారు.
కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన మంగళవారం ఖమ్మంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో(Government Hospital) డయాలసిస్ చేయించుకుంటుండగా బీపీ సమస్యతో అస్వస్థతకు గురై మృతి చెందారు. ఆయన అంతిమయాత్రలో హిందూ, ముస్లిం, క్రిస్టియన్(Hindu, Muslim, Christian) మతాలకు అతీతంగా చిన్ననాటి స్నేహితులు పాల్గొని పాడె మోస్తూ కన్నీటి వీడ్కోలు పలకడం పలువురిని కదిలించింది.
మతాలకు అతీతంగా స్నేహబంధం..
మైసయ్య మృతితో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో పాటు చిన్ననాటి స్నేహితులు తీవ్ర విషాదానికి గురయ్యారు. ఆయన అంతిమయాత్రలో హిందూ, ముస్లిం, క్రైస్తవ మతాలకు చెందిన స్నేహితులు కలిసి పాడె మోస్తూ శ్మశానం వరకు సాగారు. మతాలకు అతీతంగా స్నేహానికి ఉన్న విలువను చాటుతూ, తమ ఆత్మీయ మిత్రుడికి కన్నీటి వీడ్కోలు పలికారు. ఈ దృశ్యం అక్కడికి వచ్చిన వారిని భావోద్వేగానికి గురిచేసింది.
పలువురు నాయకుల నివాళులు..
మైసయ్య మృతి పట్ల మాజీ మంత్రి సంబాని చంద్రశేఖర్ రావు చరవాణి ద్వారా కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపం తెలిపారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నలగాటి ప్రసన్న రాజ్, కూసుమంచి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బజ్జూరి వెంకట్ రెడ్డి, పాలేరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ ఇన్చార్జి భీమిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మహమ్మద్ హఫీజ్ ఉద్దీన్, స్థానిక సర్పంచ్ కొండా కృష్ణవేణి, బీజేపీ జిల్లా నాయకుడు గుండా ఉపేందర్ రెడ్డి, వార్డు సభ్యులు చెరుకుపల్లి వీరయ్య, భారీ వీరభద్రం, మాజీ ఎంపీటీసీ మాదాసు ఉపేందర్ రావుతో పాటు యువజన నాయకుడు కొండా మహిపాల్, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, పాత్రికేయులు మైసయ్య భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.