మహర్షి వాల్మీకి జీవితం అందరికీ ఆదర్శం..
జయంతి వేడుకల్లో వక్తల పిలుపు
ఆదిలాబాద్, అక్టోబర్ 26, (విజయక్రాంతి): రామాయణ మహాకావ్యాన్ని రచించి, ప్రపంచానికి ధర్మం, సత్యం, న్యాయం, మానవతా విలువలను చాటిచెప్పిన ఆదికవి మహర్షి శ్రీ వాల్మీకి జయంతి(Maharshi Valmiki Jayanti) వేడుకలను అధికారికంగా ఘనంగా నిర్వహించారు. సోమవారం కలెక్టరేట్ లో నిర్వహించిన వేడుకల్లో అదనపు కలెక్టర్ చిత్రు, మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూష సతీష్, బీసీ సంఘాల నేతలతో కలిసి వాల్మీకి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఛైర్పర్సన్ మాట్లాడుతూ మహర్షి వాల్మీకి రచించిన రామాయణం కేవలం ఒక ఇతిహాసం మాత్రమే కాదని, ప్రతి మనిషి జీవితానికి మార్గదర్శకమని పేర్కొన్నారు. ధర్మబద్ధంగా జీవించడం, సత్యాన్ని ఆచరించడం, పెద్దలను గౌరవించడం, సమాజం పట్ల బాధ్యతతో మెలగడం వంటి గొప్ప విలువలను రామాయణం మనకు బోధిస్తుందని అన్నారు. భాషలు ఎన్నైనా, భావం ఒక్కటే… ధర్మం, మానవత్వం, సత్యమే మానవ జీవితానికి నిజమైన మార్గదర్శకాలని ఆమె పేర్కొన్నారు.
ప్రపంచంలో ఎన్నో భాషలు ఉన్నప్పటికీ, మహర్షి వాల్మీకి రచించిన రామాయణం లోని ఆదర్శాలు భాషలకు, ప్రాంతాలకు అతీతంగా ప్రజల హృదయాలను చేరుకుంటున్నాయని తెలిపారు. వివిధ భాషల్లో రామాయణం అందుబాటులో ఉండటం మన భారతీయ సంస్కృతి గొప్పతనానికి, మహర్షి వాల్మీకి సాహిత్య వైభవానికి నిదర్శనమని అన్నారు. మహర్షి వాల్మీకి జీవితం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం అధ్యక్షుడు చిక్కాల దత్తు, అధికారులు మనోహర్, సునీత, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.