64 నేరాల గజదొంగపై పీడీ యాక్ట్ ప్రయోగం!
శేరిలింగంపల్లి, అక్టోబర్ 26 (విజయక్రాంతి): వరుస దొంగతనాలు, దోపిడీలు, బెదిరింపులతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న గజదొంగ డేరంగుల రవి అలియాస్ గజ (24)పై సైబరాబాద్ పోలీస్(Cyberabad Police) కమిషనర్ డాక్టర్ ఎం. రమేష్ పీడీ యాక్ట్ ప్రయోగించారు. సూరారం కాలనీకి చెందిన రవి 2008 నుంచి 2026 వరకు మొత్తం 64 నేరాల్లో పాల్గొన్నట్లు పోలీసులు తెలిపారు.
కత్తులతో బెదిరించి దోపిడీలకు పాల్పడటంతో పాటు తాళం వేసిన ఇళ్లలో చోరీలు, ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడేవాడని వెల్లడించారు. ప్రజల భద్రతకు ముప్పుగా మారిన అతడిని మరిన్ని నేరాలకు పాల్పడకుండా నిరోధించేందుకు పీడీ చట్టం కింద నిర్బంధించి చర్లపల్లి కేంద్ర కారాగారానికి తరలించినట్లు సైబరాబాద్ పోలీసులు తెలిపారు.