దండారి ఉత్సవాలలో ఎంపీ గోడం నగేష్..
కోయల్ పాండ్రి, మారుతీగూడ గ్రామాల్లో వైభవంగా దండారి ఉత్సవాలు..
ఆదివాసుల నృత్యాలతో అలరించిన ఎంపీ గోడం నగేష్..
ఉట్నూర్, నవంబర్ 06 (విజయక్రాంతి): ఆదివాసీల విశిష్ట సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అయిన గుస్సాడి దండారి ఉత్సవాలు ఇంద్రవెల్లి మండలంలో కోయల్ పాండ్రి మారుతీగూడ గ్రామాలలో అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఇంద్రవెల్లి మండలంలోని కోయల్ పాండ్రి, మారుతీగూడ గ్రామాల్లో జరిగిన ఉత్సవాలలో ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు గోడం నగేష్(MP Godam Nagesh) ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
గ్రామాలకు చేరుకున్న ఎంపీకి ఆదివాసీలు తమ సంప్రదాయ పద్ధతుల్లో ఘన స్వాగతం పలికారు. అనంతరం గ్రామ పటేళ్లు, దేవరీలతో కలిసి ఎంపీ గోడం నగేష్ ఎత్మాసూర్ గుస్సాడి దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ పటేళ్లు, దేవరీలు ఎంపీ ఘనంగా సన్మానించి, సత్కరించారు. అనంతరం ఆదివాసీ కళాకారులతో కలిసి ఎంపీ ఉత్సాహంగా సంప్రదాయ నృత్యం చేసి అందరినీ అలరించారు. సంప్రదాయాలను భావితరాలకు అందించాలని ఎంపీ గోడం నగేష్ ఆదివాసి పెద్దలకు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీ గోడం నగేష్ మాట్లాడుతూ.. "దండారి గుస్సాడి ఉత్సవాలు ఆదివాసీల ప్రత్యేక గుర్తింపునకు ప్రతిక అన్నారు. ఈ సంప్రదాయం ఎక్కడా పుస్తకాలలో రాయబడ లేదన్నారు. ఒకరిని చూసి ఒకరు నేర్చుకుంటూ, తరతరాలుగా ఈ గొప్ప సంస్కృతిని కాపాడుకుంటూ వస్తున్నామన్నారు. మన పూర్వీకులు అందించిన ఈ విశిష్ట సంప్రదాయాలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది" అని పిలుపునిచ్చారు.
గ్రామాల అభివృద్ధిపై ఆయన మాట్లాడుతూ.. గతంలో ఈ ప్రాంతాన్ని ఎంతో అభివృద్ధి చేశానని, ఇంద్రవెల్లి చుట్టుపక్కల గ్రామాలకు బీటీ(BT) రింగ్ రోడ్డు వేయించడంతో పాటు మౌలిక వసతులు కల్పించామని గుర్తుచేశారు. రాబోయే రోజుల్లో గ్రామాల్లో సీసీ (CC) రోడ్లు మంజూరు చేసి, ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ వేడుకల్లో రాష్ట్ర బీజేపీ నాయకులు తాటిపల్లి గంగాధర్ రావు, సీనియర్ బీజేపీ నాయకులు జి.వి. రమణ, మాజీ జెడ్పీటీసీ పుష్పరాణి, జాదవ్ సుమన్ బాయి, బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు రాజలింగు, తోడసం నాగోరావ్, సర్పంచ్ మెస్రం తుకారాం, మాజీ సర్పంచ్ జాదవ్ రమేష్, దిశ డైరెక్టర్ పెందూర్ తుల్సిరాం, కోవా రాజేశ్వర్, సీనియర్ నాయకులు మోర్ దిలీప్, మాజీ ఎంపీటీసీ కనక హన్మంతు, అడ్వకేట్ ఎట్టం రాములు, మాజీ సర్పంచ్ గేడం యశ్వంత్ తదితర నాయకులు, ఆదివాసీ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.