నెరవేరని సీఎం హామీ
- నేటికి నోచుకోని నాగోబా ఆలయ రహదారి...
- జనవరి లోనే నాగోబా జాతర...
ఉట్నూర్, అక్టోబర్ 18 (విజయక్రాంతి): రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(State Chief Minister Revanth Reddy) తొలి అధికార పర్యటనలో ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ నాగోబా ను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ముత్నూర్ నుండి కేస్లాపూర్ నాగోబా ఆలయం వరకు రెండు వరుసల రోడ్డుతో పాటు మధ్యలో డివైడర్ ఏర్పాటు చేయిస్తానని, అందుకు అవసరమైన రూ.15 కోట్ల రూపాయలను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.
సీఎం హామీ ఇచ్చి మూడేళ్లు అవుతున్న నేటికీ పనులు ప్రారంభం కాలేదు. రాష్ట్రంలోనే ఆదివాసులు ఘనంగా జరుపుకునే నాగోబా జాతరకు తెలంగాణ తోపాటు ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, చత్తీస్గడ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో నివాసముండే ఆదివాసులు పెద్ద సంఖ్యలో పాల్గొంటుంటారు. లక్షలాది మంది భక్తులు దర్శించుకునే నాగోబా ఆలయానికి సరియైన రోడ్డు సౌకర్యం లేక గంటల తరబడి ట్రాఫిక్ జామ్ కావడాన్ని మెస్రం వంశపు పెద్దలు సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు.
వారి సూచనల మేరకు సీఎం హామీ ఇచ్చి నిధులు మంజూరు చేశారు. కానీ ప్రభుత్వం మంజూరు చేసిన నిధులకు ఐటిడిఏ ఇంజనీరింగ్ విభాగం టెండర్లు పూర్తిచేసి ఏడాది అయిన నేటికీ పనులు ప్రారంభించ లేదు. జనవరిలో జాతర జరగనున్న నేపద్యంలో మరో మూడు నెలల కాలంలో మూడున్నర కిలోమీటర్ల దూరం రెండు వరసల రహదారి పనులు పూర్తయితాయో లేవోనని ఆదివాసి గిరిజనులు చర్చించుకుంటున్నారు.
జాతర దగ్గర పడిన సమయంలో రోడ్డు పనులు ప్రారంభిస్తే కాంట్రాక్టర్ నాసిరకంగా పనులు పూర్తి చేసి చేతులు దులుపుకుంటారని గిరిజనులు వాపోతున్నారు. ఇప్పటికైనా రోడ్డు పనులు ప్రారంభించి నాగోబా జాతర ప్రారంభానికి ముందే రోడ్డు పనులు పూర్తి చేయాలని గిరిజనులు కోరుతున్నారు.
త్వరలో రోడ్డుపనులు ప్రారంభిస్తాం..
నాగోబా జాతర ప్రారంభానికి మూ డు నెలల సమయం ఉందని, జాతర ప్రారంభానికి ముందే రోడ్డు పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్ ను ఆదేశించాం. త్వరలో రోడ్డు పనులు ప్రారం భించి, నాణ్యతగా రోడ్డు పనులు పూర్తి చేయిస్తామని అన్నారు.
జాదవ్ తానాజీ, ఈ.ఈ, ఇంజనీరింగ్ విభాగం