బడి ఈడు పిల్లలు తప్పనిసరిగా చదువుకోవాలి..
* చదువుకుంటేనే గూడెంతో పాటు అన్ని రంగాల్లో అభివృద్ధి..
* ఐటిడిఏ పిఓ మంద మకరందు...
ఉట్నూర్, సెప్టెంబర్ 23 (విజయక్రాంతి): గిరిజనగూడాల్లో బడి ఈడు పిల్లలు తప్పనిసరిగా పాఠశాలకు వెళ్లి చదువుకోవాలని ఐటిడిఏ పిఓ మంద మకరందు(ITDA PO Manda Makarandu) అన్నారు. బుధవారం ఇంద్రవెల్లి మండలంలోని హీరపూర్, పిట్టబొంగరం, గిన్నెర గ్రామాలలో పర్యటించారు. హీరాపూర్ గ్రామంలో ఏర్పాటుచేసిన గిరిజనుల ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఉద్దేశించి మాట్లాడుతూ.. ఆరు సంవత్సరపుల్లోపు పిల్లలను అంగన్వాడి కేంద్రాలకు పంపించాలని సూచనలు చేశారు. ఆరు నుండి 18 ఏళ్ల పిల్లలు తప్పనిసరిగా సర్కారు పాఠశాలలకు, కళాశాలలకు వెళ్లి విద్యను అభ్యసించాలన్నారు. ప్రతి ఒక్కరు చదువుకోవడంతో గ్రామాల అభివృద్ధితో పాటు కుటుంబ అభివృద్ధి జరుగుతుందని సూచనలు చేశారు.
గ్రామాల్లోని ప్రతి మహిళ స్వయం సహాక సంఘంలో సభ్యురాలుగా చేరి పొదుపుతో పాటు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని సూచనలు చేశారు. రైతులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకొని వ్యవసాయ అభివృద్ధి చేయాలన్నారు. 18 నుండి 30 ఏళ్ల యువతీ యువకులు ఆర్థికంగా ఎదగడానికి నైపుణ్య శిక్షణ తీసుకోవాలన్నారు. డిగ్రీ పూర్తి చేసిన యువతీ యువకులకు స్వయం ఉపాధి, ప్రైవేట్ ఉద్యోగాలు పొందే విధంగా ఉట్నూరులో శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాలని సూచనలు చేశారు.