గణేష్ నిమజ్జనంలో డీజే మోతతో దడదడ!

23-09-2026 | 05:45am
  1. అతిశబ్దం.. ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం
  2. భక్తి పేరుతో హద్దులు దాటొద్దు..
  3. మండప నిర్వాహకులు జాగ్రత్తలు పాటించాలి

మహబూబాబాద్, సెప్టెంబర్ 22(విజయక్రాంతి): గణనాథుడి నిమజ్జనం(Immersion of Lord Ganesha).. భక్తి, ఉత్సాహం, ఆధ్యాత్మికతకు ప్రతీక. అయితే ఇటీవలి కాలంలో నిమజ్జన శోభాయాత్ర(Immersion Procession)ల్లో డీజే సౌండ్స్(DJ sound systems) వినియోగం విపరీతంగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. భక్తి కార్యక్రమం కాస్తా భారీ శబ్దాల ప్రదర్శనగా మారితే ప్రజల ఆరోగ్యంతో పాటు వృద్ధులు, చిన్నారులు, గర్భిణులు, అనారోగ్యం(Elderly, young children, pregnant women, illness)తో బాధపడుతున్నవారిపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఏర్పడనుంది. నేడు ఉమ్మడి వరంగల్ జిల్లా(Warangal District) వ్యాప్తంగా గణేష్ నిమజ్జల వేడుకల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన నివారణ చర్యలపై ప్రత్యేక కథనం. 

చెవులకు మోత.. ఆరోగ్యానికి ముప్పు

అధిక శబ్దానికి ఎక్కువసేపు గురికావడం వల్ల చెవుల్లో మోగుడు, వినికిడి సమస్యలు, తలనొప్పి, చిరాకు, ఒత్తిడి వంటి సమస్యలు తలెత్తవచ్చు. చిన్నారులు, వృద్ధులు, శబ్దానికి సున్నితంగా స్పందించే వ్యక్తులు మరింత ఇబ్బందికి గురయ్యే అవకాశం ఉంటుంది. భారీ శబ్దం కారణంగా శోభాయాత్రలో పాల్గొనే వారిలో అప్రమత్తత తగ్గి ప్రమాదాలకూ దారితీయవచ్చు.

గుండె రోగులు.. మరింత జాగ్రత్త

అధిక శబ్దం శారీరక ఒత్తిడిని పెంచే అవకాశం ఉన్నందున గుండె సంబంధిత సమస్యలు, రక్తపోటు వంటి ఆరోగ్య సమస్యలు ఉన్నవారు డీజేలకు సమీపంలో ఎక్కువసేపు ఉండకుండా జాగ్రత్తపడాలి. ముఖ్యంగా ఆసుపత్రులు, వృద్ధాశ్రమాలు, పాఠశాలలు, నివాస ప్రాంతాల సమీపంలో శబ్ద నియంత్రణ మరింత కీలకం.

భక్త మండళ్ల బాధ్యత

గణేష్ మండపాల నిర్వాహకులు భక్తి, ఉత్సాహంతో పాటు సామాజిక బాధ్యతను కూడా గుర్తుంచుకోవాలి. నిమజ్జన శోభాయాత్రకు ముందు స్థానిక పోలీసు, సంబంధిత అధికారుల నుంచి అవసరమైన అనుమతులు తీసుకోవాలి. అనుమతించిన సమ యాలు, శబ్ద పరిమితులు, స్థానిక నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి. డీజే బాక్సులను ప్రజలకు, ఇళ్లకు లేదా ఆసుపత్రులకు అత్యంత సమీపంలో ఏర్పాటు చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

శబ్దం కంటే సందేశమే గొప్పది.

భక్తిని చాటుకోవడానికి భారీ శబ్దాలే అవసరం లేదు. భక్తిగీతాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, సామాజిక సందేశాలతో శోభాయాత్రను నిర్వహించడం ద్వారా వేడుకకు మరింత అర్థవంతమైన రూపం ఇవ్వవచ్చు. శోభాయాత్రలో చిన్నారులు, మహిళలు, వృద్ధుల భద్రతకు ప్రత్యేకంగా వాలంటీర్లను ఏర్పాటు చేయడం మంచిది.

అత్యవసర పరిస్థితులకు సిద్ధంగా ఉండాలి

శోభాయాత్ర మార్గంలో ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా ముందస్తు ప్రణాళిక రూపొందించాలి. విద్యుత్ తీగలు, ట్రాన్స్ఫార్మర్లు, రోడ్డు మలుపులు, చెరువులు, కాలువల వద్ద ప్రత్యేక అప్రమత్తత అవసరం. ప్రథమ చికిత్స పెట్టె, తాగునీరు, అత్యవసర సంప్రదింపు నంబర్లు అందుబాటులో ఉంచాలి. చిన్నారులు తప్పిపోకుండా తల్లిదండ్రులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి.

*పండుగ స్ఫూర్తిని కాపాడుకుందాం

గణేశ్ నిమజ్జనం ఆనందోత్సాహాలతో జరుపుకోవాల్సిన పవిత్ర వేడుక. అయితే మన ఆనందం ఇతరులకు అసౌకర్యంగా మారకూడదు. 

భక్తి ఉండాలి.. అతిశబ్దం వద్దు

భక్తి..ఉత్సాహం ఉండాలి.. ‘అజాగ్రత్త వద్దు’ అనే సందేశంతో గణేష్ మండళ్ల నిర్వాహకులు, యువత, భక్తులు ముందుకు సాగాలి. నియమాలు పాటిస్తూ ప్రశాంతంగా, సురక్షితంగా నిమజ్జన వేడుకలను నిర్వహించడం ద్వారా పండుగ స్ఫూర్తిని మరింత ఉన్నతంగా నిలబెట్టవచ్చు.

డీజేలకు అనుమతి లేదు

గణేష్ నవరాత్రి వేడుకలను ముగించుకొని బుధవారం నిమజ్జన వేడుకలను నిర్వహిస్తున్న నేపథ్యంలో శోభాయాత్రలో భారీ శబ్దాలు చేసే డీజే సౌండ్స్ కు అనుమతి లేదు. నిర్వాహకులు ఈ విషయాన్ని తప్పకుండా పాటిస్తూ, ప్రజల ఆరోగ్య, శబ్ద కాలుష్య నియంత్రణకు సహకరించాలి. పోలీసు శాఖ హెచ్చరికలను పట్టించుకోకుండా ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. ధ్వని కాలుష్యం లేకుండా శోభాయాత్రలు నిర్వహించుకోవడం వల్ల గణేష్ నిమజ్జనం వేడుకలను ప్రశాంతంగా సంతోషంగా నిర్వహించుకోవచ్చు. 

- డాక్టర్ శబరీష్, 

ఎస్పీ, మహబూబాబాద్ జిల్లా

మరిన్ని వార్తలు