భద్రాచలంలో జరగనున్న వినాయక నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలి
- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్
- శ్రీసీతారామచంద్ర స్వామీ దేవాలయ ఆలయ పునః నిర్మాణాలు నాణ్యతతో సకాలంలో పూర్తిచేయాలి
- దేవాలయంలో నిర్మాణాలు భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ట్ తో కలిసిన పరిశీలించిన జిల్లా కలెక్టర్
భద్రాచలం,( విజయక్రాంతి): భద్రాచలం పట్టణంలో వినాయక నిమజ్జన కార్యక్రమం విజయవంతంగా, శాంతియుతంగా, సురక్షితంగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు చేపెట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ (District Collector Ankit) అధికారులను ఆదేశించారు. శనివారం భద్రాచలం గోదావరి నది తీర ప్రాంతంలో నిమజ్జన ఘాట్ల వద్ద జరుగుతున్న నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించారు. నిమజ్జనానికి లాంచీలు బారికేడింగ్, లైటింగ్, సీ.సీ కెమెరాల పర్యవేక్షణ, తాగునీరు, వైద్య బృందాలు, గజ ఈతగాళ్లు వంటి అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు జిల్లా కలెక్టర్ వివరించారు. నదీ తీర ప్రాంతంలో ఎటువంటి అపశృతి జరగకుండా విస్తృతంగా, భద్రతతో కూడిన రక్షణ చర్యలు చేపట్టాలని భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ట్ , డీఎస్పీ అరుణ్ కుమార్ లకు సూచించారు.
ఈ నెల 24,25,26 వ తేదీల్లో జరిగే నిమజ్జనానికి పోలీస్,రెవెన్యూ, రవాణా,వైద్య ఆరోగ్య,అగ్నిమాపక, అటవీ, ఇరిగేషన్,దేవాదాయ,పంచాయతీ శాఖల అధికారులు, సిబ్బంది ఎప్పటికప్పుడు పర్యవేక్షించి ఉన్నతాధికారులకు సమాచారం అదించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వినాయక నిమజ్జనానికి భద్రాచలం రానున్నారని తెలిపారు. నిర్దేశించిన ప్రదేశాలలోనే వినాయక నిమజ్జనం చేయాలని,ప్రణాళికా బద్దంగా పనిచేసేలా అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు.
భక్తులకు, గణేశ మండపాల నిర్వాహకులు వినాయక అనంతరం దేవాలయంలో జరుగుతున్న అభివృద్ధి పున నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ క్షుణ్ణంగా పరిశీలించారు.ఉత్తర ద్వార దర్శనం, చిత్రకూట మండపం పరిసరాలను,గోశాల ప్రాంతాన్నీ,అన్నదాన సత్రం,విస్తా కాంప్లెక్స్, శివాలయానికి వెళ్లే మార్గం, రామాలయంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులు మాడవీధులను, పరిసర ప్రాంత అభివృద్ధి నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
అభివృద్ధికి సంబంధించిన వివరాలను సంబంధిత అధికారుల నుంచి అడిగి తెలుసుకున్నారు. కాంట్రాక్టర్స్ ను ఆలయ నిర్మాణ పనులు సకాలంలో పూర్తయ్యేలా చూడాలని తెలియజేసారు. ఎటువంటి నాణ్యతా లోపాలు లేకుండా, దశాబ్దాల కాలం పాటు నిర్మాణాలు ప్రతిష్టంగా ఉండేలా చూసుకోవాలని స్పష్టం చేశారు. గోదావరి పుష్కరాల ప్రారంభంలోపు గోదావరి పరివాహక ప్రాంతంలో గల గోదావరి ఘాట్లు నిర్మాణాలు అభివృద్ధి పనులు పూర్తిచేసేలా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం సర్పంచ్ పూనం కృష్ణ,డీఎస్పీ అరుణ్ కుమార్,పంచాయతీ ఈ.ఓ శ్రీనివాస్ రావు, దేవాలయ ఈ.వో దామోదర్ రావు తదితరులు పాల్గొన్నారు.