యు పి ఐ చెల్లింపులపై ఛార్జీలను రద్దు చేయాలి
అశ్వారావుపేట (విజయ క్రాంతి): కేంద్రంలోని మోదీ ప్రభుత్వం డిజిటల్ లావాదేవీల పేరుతో సామాన్య ప్రజలు, చిరు వ్యాపారులపై ఛార్జీల భారం మోపడాన్ని నిరసిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండల కేంద్రంలో శనివారం సి పి ఐ (ఎం ఎల్) మాస్ లైన్ పార్టీ (CPI(ML) Mass Line Party) ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. స్థానిక బస్టాండ్ సెంటర్లో నిర్వహించారు.
ఈ సందర్భంగా సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ జిల్లా సెక్రటేరియట్ సభ్యులు గోకినపల్లి ప్రభాకర్ మాట్లాడుతూ.. "భవిష్యత్తు అంతా డిజిటల్ మయం, క్యాష్‌లెస్ ఎకానమీ" అని గొప్పలు చెప్పిన కేంద్ర ప్రభుత్వం, ఇప్పుడు ఫోన్ పే, గూగుల్ పే వంటి యూపీఐ చెల్లింపులపై ఛార్జీలు విధించి ప్రజలను నిలువునా దోపిడీ చేస్తోందని మండిపడ్డారు. రూ.2,000 వరకు వసూళ్లు లేవని చెబుతున్నప్పటికీ, అంతిమంగా అది ప్రజలు మరియు చిరు వ్యాపారులపై తీవ్ర ఆర్థిక భారంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒత్తిళ్లకు తలొగ్గి కేంద్ర ప్రభుత్వం ఇలాంటి ప్రజావ్యతిరేక నిర్ణయాలు తీసుకోవడం సిగ్గుచేటని ఆయన విమర్శించారు. ఒకవైపు బడా కార్పొరేట్లకు లక్షల కోట్ల రూపాయల రాయితీలు ఇస్తూ, మరోవైపు సామాన్యులపై పన్నులు, ఛార్జీల పేరుతో భారం మోపడం దుర్మార్గమన్నారు. తక్షణమే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే అన్ని వర్గాల ప్రజలను సమీకరించి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ జిల్లా నాయకుడు కంగాల కల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.