బహుజనుల రాజ్యాధికారంతోనే సామాజిక తెలంగాణ
- డబ్బు రాజకీయాల జబ్బును వదిలిస్తాం...
- రాజ్యాధికారమే టీఆర్పీ అంతిమ లక్ష్యం...
- తీన్మార్ మల్లన్న పాదయాత్రను విజయవంతం చేద్దాం...
- రాజ్యాధికార యాత్రకు మద్దతుగా బైక్ ర్యాలీ..
- జిల్లా అధ్యక్షులు మహేష్ వర్మ...
భీమారం, (విజయక్రాంతి): బహుజనుల రాజ్యాధికారంతోనే సామాజిక తెలంగాణ సాధ్యమని, రాజ్యాధికారమే టీఆర్పీ అంతిమ లక్ష్యమని తెలంగాణ రాజ్యాధికార పార్టీ (Telangana Rajyadhikari Party) మంచిర్యాల జిల్లా అధ్యక్షులు మహేష్ వర్మ తెలిపారు. మంచిర్యాల జిల్లా భీమారం మండల కేంద్రంలో మండల అధ్యక్షులు దెబ్బెట శంకర్, తగరం రాజ్ కుమార్ ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బైక్ ర్యాలీలో పాల్గొన్న అనంతరం ఆయన మాట్లాడారు.
తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు తీన్మార్ మల్లన్న రాజ్యాధికారమే లక్ష్యంగా రాజ్యాధికార పాదయాత్రని ప్రారంభించడం జరిగిందని తెలిపారు. రాజ్యాధికార ఆవశ్యకతను ప్రజలకు వివరిస్తూ, ఎవరెంతో వారికంత వాటా అందించేందుకు ఈ యాత్రను జిల్లావ్యాప్తంగా కొనసాగిస్తున్నామని తెలిపారు. రానున్న రోజుల్లో తెలంగాణ రాజ్యాధికారం పార్టీ ఆధ్వర్యంలో ప్రజా పోరాటాలను కొనసాగించే దిశగా జిల్లా నాయకత్వం, మండల నాయకత్వం పనిచేస్తుందని స్పష్టం చేశారు.
వచ్చేది బీసీల రాజ్యమే అని, తీన్మార్ మల్లన్న నాయకత్వంలోనే బహుజనుల రాజ్యాధికారాన్ని సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. టీఆర్పీ అధికారంలోకి వస్తే డబ్బు రాజకీయాల జబ్బును వదిలించి, ప్రజా రాజకీయాలను ప్రజలకు అందించేందుకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ పనిచేస్తుందన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి, ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపిస్తూ, ప్రజలను చైతన్యం చేస్తూ, రాజ్యాధికారం దిశగా అడుగులు వేస్తామని తెలిపారు.
బీసీ ఉద్యమాన్ని నీరు కార్చేందుకు దొరల దగ్గర ఊడిగం చేస్తున్న కొంతమంది బీసీ ఉద్యమ ద్రోహులను ఉపేక్షించేది లేదని, రానున్న రోజుల్లో ప్రజలే వారికి బుద్ది చెబుతారని హెచ్చరించారు. అగ్రవర్ణ నాయకుల రాజకీయ ఆధిపత్యాన్ని అంతం చేసి, రాజ్యాధికారాన్ని ప్రజలకు అందిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు పడాల శివతేజ, మహమ్మద్ లతీఫ్, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.