ప్రజావాణి దరఖాస్తులకు సత్వర పరిష్కారం చూపాలి

12-10-2026 | 04:21pm

 దమ్మపేట మండల ప్రజావాణిని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్

దమ్మపేట,(విజయ క్రాంతి): సోమవారం దమ్మపేట మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమాన్ని(Prajavani program) జిల్లా కలెక్టర్ అంకిత్(Collector Ankit) ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రజావాణికి హాజరైన వివిధ శాఖల అధికారుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మండలంలో ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో నెలకొన్న పరిస్థితులపై అధికారులతో సమీక్షించారు.

ఎల్‌నినో ప్రభావం(Impact of El Niño)తో తాగునీటి సరఫరా, చెరువుల నీటి నిల్వలు, వ్యవసాయ పరిస్థితులపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. మిషన్ భగీరథ అధికారులను తాగునీటి సరఫరా వివరాలను అడిగి తెలుసుకుని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిరంతరాయంగా తాగునీరు అందించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇరిగేషన్ అధికారుల ద్వారా మండలంలోని 230 చెరువుల నీటి నిల్వల వివరాలను తెలుసుకున్నారు.

ఎల్‌నినో ప్రభావంతో వ్యవసాయ రంగం(Agricultural Sector)లో ఎదురయ్యే పరిస్థితులకు అనుగుణంగా రైతులకు అవసరమైన సూచనలు అందించాలని తెలిపారు. అటవీశాఖ అధికారులను ఫారెస్ట్–రెవెన్యూ సంయుక్త సర్వేలు, భూ రీసర్వే పురోగతిపై కలెక్టర్ ఆరా తీశారు. మండల ప్రజావాణికి ప్రజలు తక్కువ సంఖ్యలో హాజరవుతున్న అంశంపై కలెక్టర్ ఆరా తీశారు. ప్రతి వారం ఎంతమంది దరఖాస్తుదారులు వస్తున్నారు, మండల స్థాయిలో పరిష్కరించగల సమస్యల కోసం ప్రజలు జిల్లా కేంద్రంలోని ప్రజావాణికి ఎందుకు వస్తున్నారనే వివరాలను ఎంపీడీవోను అడిగి తెలుసుకున్నారు.

మండల ప్రజావాణి కార్యక్రమంపై గ్రామాల్లో టామ్‌టామ్ ద్వారా విస్తృత ప్రచారం నిర్వహించాలని, యువత సహకారంతో సోషల్ మీడియా ద్వారా ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు తమ సమస్యలను మండల స్థాయిలోనే అధికారుల దృష్టికి తీసుకువచ్చేలా చర్యలు చేపట్టాలని, ప్రజావాణికి వచ్చే ప్రతి దరఖాస్తును పరిశీలించి సత్వర పరిష్కారానికి కృషి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో దమ్మపేట తాసిల్దార్ మురళి, ఎంపీడీవో రవీందర్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు