నాడు స్కైలాబ్.. నేడు సైబర్ భయం!?

29-10-2026 | 05:15am
  1. నాడు ప్రాణభయం.. నేడు అత్యాశే ఆయుధం!
  2. భయంతో బతుకును ముగించుకున్నంత పనిచేసిన నాటి జనం 
  3. ఆశల వలలో చిక్కి జీవితాలను ఛిద్రం చేసుకుంటున్న నేటి మనుషులు!

అశ్వాపురం, అక్టోబర్ 28 (విజయక్రాంతి): ఒకప్పుడు ఆకాశం నుంచి స్కైలాబ్ భూమిపై పడుతుందన్న వార్త ప్రపంచాన్ని వణికించింది. 1979లో అమెరికా అంతరిక్ష కేంద్రం స్కైలాబ్(Skylab) భూమివైపు దూసుకొస్తున్న సమయంలో ఇక ప్రపంచం అంతమవుతుందేమోనన్న భయం సామాన్యులను వెంటాడింది. శాస్త్రీయ సమాచారం కంటే వదంతులే వేగంగా వ్యాపించాయి.

రేపు బతుకుతామో లేదోనన్న ఆందోళనతో కొందరు తమ చివరి కోరికలు తీర్చుకునే ప్రయత్నం చేశారు. మరికొందరు ఉన్నదంతా ఖర్చు చేసి జీవితాన్ని ఆస్వాదించాలని భావించారు. చివరకు స్కైలాబ్ శకలాలు ప్రధానంగా హిందూ మహాసముద్రం, ఆస్ట్రేలియా ప్రాంతాల్లో పడ్డాయి. ప్రపంచం అంతమవుతుందన్న ప్రచారం వట్టి భయంగానే మిగిలిపోయింది.

నాడు భయం చంపింది.. నేడు ఆశ ముంచుతోంది!

కాలం మారింది. సాంకేతిక పరిజ్ఞానం(Technology) పెరిగింది. అరచేతిలో ప్రపంచం కనిపిస్తోంది. కానీ మనిషి ఆలోచనల్లో మాత్రం ఆశించినంత పరిణతి కనిపించడం లేదు. నాడు స్కైలాబ్ పడుతుందన్న భయంతో విచక్షణ కోల్పోయిన మనిషి.. నేడు సైబర్ నేరగాళ్లు విసిరే ఆశల వలలో చిక్కుకుని తన జీవితాన్ని తానే నాశనం చేసుకుంటున్నాడు. మీకు లక్షల రూపాయల బహుమతి వచ్చిందని, తక్కువ పెట్టుబడితో రెట్టింపు లాభాలు పొందవచ్చని, ఇంట్లో కూర్చునే వేల రూపాయలు సంపాదించవచ్చని వచ్చే సందేశాలను నమ్మి నిలువునా మోసపోతున్నారు. బ్యాంకు అధికారులు, పోలీసుల పేరుతో వచ్చే నకిలీ ఫోన్కాల్స్కు భయపడి జీవితకాలం కష్టపడి సంపాదించిన సొమ్మును అపరిచితుల చేతుల్లో పెడుతున్నారు.

హెచ్చరికలు వినిపిస్తున్నా.. మేల్కొనేదెప్పుడు?

సైబర్ నేరాలపై పోలీసులు, ప్రభుత్వాలు ఎన్నిసార్లు అవగాహన కల్పిస్తున్నా మోసాలు ఆగడం లేదు. అపరిచిత లింకులు తెరవద్దని, ఓటీపీలు చెప్పవద్దని, అధిక లాభాల ఆశతో పెట్టుబడులు పెట్టవద్దని హెచ్చరిస్తున్నా.. క్షణికావేశం, అత్యాశ, భయం మనిషిని నేరగాళ్ల ఉచ్చులోకి నెడుతున్నాయి. విచిత్రమేమిటంటే.. నాడు స్కైలాబ్ భూమిపై పడకముందే భయంతో జీవితపు చివరి ఘడియలను ఊహించుకున్నారు. నేడు సైబర్ నేరగాడు కనిపించకుండానే మనిషి సంపాదనను, ప్రశాంతతను, కుటుంబ భవిష్యత్తును కూల్చేస్తున్నాడు.

ఆశావహుల జీవితాల్లో చీకట్లు!

మంచి ఉద్యోగం రావాలని ఒకరి ఆశ.. అప్పులు తీరి కుటుంబం బాగుపడాలని మరొకరి ఆశ.. తక్కువ సమయంలో ఆర్థికంగా ఎదగాలని ఇంకొకరి ఆశ. ఇలాంటి ఆశలనే సైబర్ నేరగాళ్లు పెట్టుబడిగా మార్చుకుంటున్నారు. చివరకు డబ్బులు పోగొట్టుకున్న బాధ, అప్పుల ఒత్తిడి, పరువు పోతుందన్న ఆందోళనతో కొందరు మానసికంగా కుంగిపోతున్నారు. మరికొందరు తీవ్ర నిర్ణయాలకు పాల్పడే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఆశ మనిషిని బతికించాలి. కానీ ఆ ఆశనే ఆసరాగా చేసుకుని నేరగాళ్లు జీవితాలను నిర్జీవం చేస్తుండటం నేటి సమాజపు విషాదం.

మారాల్సింది కాలం కాదు.. మన ఆలోచన!

స్కైలాబ్ ప్రమాదం గురించి నాడు సమాచారం అందుబాటులో లేక ప్రజలు భయపడ్డారనుకోవచ్చు. కానీ నేడు సమాచారం అందుబాటులో ఉన్నా, హెచ్చరికలు నిరంతరం వినిపిస్తున్నా మోసపోవడం ఆలోచించాల్సిన విషయం. ఆకాశం నుంచి పడే స్కైలాబ్ కంటే అరచేతిలోని సెల్ఫోన్ ద్వారా వచ్చే మోసపూరిత సందేశమే ఇప్పుడు ప్రమాదకరంగా మారింది. నాడు ప్రాణాలు పోతాయన్న భయంతో ఉన్నదంతా వదులుకోవడానికి సిద్ధపడ్డ మనిషి.. నేడు లేనిది సంపాదించాలన్న ఆశతో ఉన్నదంతా పోగొట్టుకుంటున్నాడు.

స్కైలాబ్ ఒక్కసారే పడింది.. సైబర్ మోసం ప్రతిరోజూ పొంచి ఉంది..

మోసపోయిన తర్వాత కన్నీళ్లు పెట్టుకోవడం కంటే మోసపోకుండా ఆలోచించడం ముఖ్యం. సాంకేతికత ఎంత ఎదిగినా విచక్షణ లేకపోతే మనిషి జీవితం నేరగాళ్ల చేతిలో కీలుబొమ్మగా మారక తప్పదు.  అత్యాశకు అడ్డుకట్ట.. అప్రమత్తతకు పెద్దపీట.. అదే నేటి మనిషికి అసలైన రక్షణ కవచం!  సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930కు ఫోన్ చేయండి. ybercrime.gov.inలో ఫిర్యాదు చేయండి.

మరిన్ని వార్తలు