హైదరాబాద్‌లో నీటి సమస్య రావొద్దు

29-10-2026 | 05:50am
  1. ఎస్టీపీలన్నీ వంద శాతం పనిచేయాల్సిందే 
  2. నిర్మాణ రంగంలో ట్రీటెడ్ వాటర్ రూల్ తప్పనిసరి
  3. డేటా సెంటర్లకూ శుద్ధి జలమే ఇవ్వాలి
  4. అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశం 
  5. తాగు నీటి సరఫరా, ఎస్టీపీలపై ఉన్నతస్థాయి సమీక్ష 

హైదరాబాద్,అక్టోబర్ 28 (విజయక్రాంతి): హైదరాబాద్‌లో ఎట్టి పరిస్థితుల్లోనూ తాగునీటి ఎద్దడి తలెత్తకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) ఆదేశించారు. తాగునీటి సరఫరా విషయంలో నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, రిజర్వాయర్లలో నిల్వలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని స్పష్టం చేశారు.

కోర్ ఏరియా తాగునీటి సరఫరా, ఎస్టీపీల నిర్మాణం, శుద్ధి చేసిన నీటి వినియోగంపై బుధవారం ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ సెంటర్‌లో సీఎం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఎల్ నినో ప్రభావం, భవిష్యత్తు సవాళ్లను దృష్టిలో ఉంచుకుని క్యూర్ ఏరియాలోని మురుగు నీటి శుద్ధి కేంద్రాలు (ఎస్టీపీలు) వంద శాతం సామర్థ్యంతో పనిచేసేలా చూడాలన్నారు.

శుద్ధి చేసిన నీటిని సచివాలయం, సీఎంవో, ఔటర్ రింగ్ రోడ్డు, మెట్రో రైల్, పబ్లిక్ పార్కులు, రహదారుల శుభ్రతకు వినియోగించాలని సూచించారు. భవన నిర్మాణ రంగంలో శుద్ధి చేసిన నీటినే వాడేలా నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని,  నగరంలో వేగంగా విస్తరిస్తున్న డేటా సెంటర్ల అవసరాలకు సైతం ట్రీటెడ్ వాటర్‌నే సరఫరా చేయాలని సీఎం స్పష్టం చేశారు. ప్రైవేట్ ఎస్టీపీల ఏర్పాటును ప్రోత్సహించడంతో పాటు, వీటి నిర్వహణకు సోలార్ విద్యుత్ వినియోగంపై కసరత్తు చేయాలని రెడ్కో అధికారులను సీఎం ఆదేశించారు.  

నీటి నాణ్యతలో రాజీ పడొద్దు

నీటి నాణ్యత విషయంలో ఏ మాత్రం రాజీ పడొద్దని, ఎస్టీపీల్లో నీటి శుద్దికి అత్యాధునిక సాంకేతిక ప్రమాణాలు పాటించాలని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. ప్రతి మురుగు నీటి శుద్ధి కేంద్రం వద్ద ప్రత్యేక అధికారిని నియమించాలని, అన్ని ప్లాంట్లను కమాండ్ కంట్రోల్ సెంటర్‌తో అనుసంధానించి నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. ‘హైడ్రా’ కూడా ప్లాంట్‌ల పనితీరును ఎప్పటికిప్పుడు పర్యవేక్షిస్తుండాలని సూచించారు. శుద్ధి జలాలను సరఫరా చేసే ట్యాంకర్లకు ట్రాకింగ్ వ్యవస్థ ఏర్పాటు చేయాలని, ప్రత్యేకంగా టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. ఆదేశాలను నవంబర్ 1నుంచి తప్పనిసరిగా అమలు చేయాలని అధికారులకు సూచించారు.

26 ఎస్టీపీల ద్వారా శుద్ధి జలాలు

హైదరాబాద్‌లో ప్రస్తుతం 26 ఎస్టీపీల ద్వారా శుద్ధి చేసిన జలాలను గ్రీన్ ట్యాంకర్లతో పంపిణీ చేస్తున్నట్లు జలమండలి అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఈ నీటిని ఉచితంగా అందిస్తున్నామని, వినియోగదారుల నుంచి కేవలం రవాణా చార్జీలు మాత్రమే వసూలు చేస్తున్నట్లు తెలిపారు. సమీక్ష సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  సంజయ్ జాజు, సీఎంఓ కార్యదర్శి మాణిక్‌రాజ్, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్, సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ సృజన, మల్కాజిగిరి మున్సిపల్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి, జలమండలి ఎండీ అశోక్ రెడ్డి, టీజీఎస్పీడీసీఎల్ ఎండీ జితేష్ వి.పాటిల్, కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శి రవి, సమాచార పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్ ముకుందరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు