ఎల్ నినో ముప్పును ఎదుర్కొంటాం

29-10-2026 | 05:40am
  1. సమష్టి కార్యాచరణ అవసరం
  2. యాసంగిలో వరి సాగు తగ్గించాలి
  3. ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలి
  4. తాగునీటికి ఇబ్బందులు రాకుండా ముందస్తు ప్రణాళికలు
  5. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
  6. పెద్దపల్లిలో అధికారులతో సమీక్ష సమావేశం

పెద్దపల్లి, అక్టోబర్ 28 (విజయక్రాంతి): సూపర్ ఎల్ నినో పరిస్థితులను ఎదుర్కొనేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు(Minister Sridhar Babu) ఆదేశించారు. భూగర్భ జలాలు తగ్గుతున్న నేపథ్యంలో యాసంగిలో వరి సాగు తగ్గించి, తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలని సూచించారు. బుధవారం పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్‌లో ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు, కలెక్టర్ కోయ శ్రీహర్ష, రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్‌తో కలిసి వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రైతులకు నష్టం కలగకుండా అందుబాటులో ఉన్న నీటిని సమర్థంగా వినియోగించుకునేలా ప్రణాళికలు రూపొందించాలని తెలిపారు. మొక్కజొన్న, శనగ, పప్పుధాన్యాలు, చిరుధాన్యాలు, నూనెగింజల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. జిల్లాలోని అన్ని గ్రామాలు, పట్టణాలకు వచ్చే ఏడాది పాటు నిరంతర తాగునీటి సరఫరా జరిగేలా ముందస్తు ఏర్పాట్లు చేయాలని సూచించారు.

నీటి వృథాను అరికట్టేలా ప్రజల్లో అవగాహన కల్పించాలని, ప్రధానమంత్రి సూర్య ఘర్ పథకం ద్వారా సౌర విద్యుత్ వినియోగాన్ని విస్తృతం చేయాలని తెలిపారు. ప్రజాప్రతినిధులు తమ ఇళ్లపై సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేసుకొని ప్రజలకు ఆదర్శంగా నిలవాలని కోరారు. ధాన్యం కొనుగోళ్లలో రైతులకు మద్దతు ధర అందేలా చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను సిద్ధం చేసి పారదర్శకంగా ధాన్యం సేకరించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ విప్ విజయ రమణారావు మాట్లాడుతూ యాసంగిలో వరి సాగును తగ్గించి ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. అనంతరం వానకాలం వరి మద్దతు ధర, ఏడు సన్న రకాల ధాన్యానికి క్వింటాలుకు అదనంగా రూ.500 చెల్లింపు, సీతమ్మలోది ట్రెక్కింగ్ కార్యక్రమాల ప్రచార పోస్టర్లను ఆవిష్కరించారు.  

మరిన్ని వార్తలు