ఎల్‌నినోను ఎదుర్కొనేందుకు ముందస్తు చర్యలు చేపట్టాలి
- అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు
- ప్రతి గ్రామ పంచాయతీలో ఉపాధి పనులు ప్రారంభించాలి
- వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి సీతక్క
హైదరాబాద్, అక్టోబర్ 28 (విజయక్రాంతి): ఎల్‌నినో ప్రభావంతో ఎదురయ్యే నీటి ఎద్దడి, కరువు పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు గ్రామస్థాయిలో ముందస్తు చర్యలు చేపట్టాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డా. ధనసరి అనసూయ సీతక్క(Minister Seethakka) ఆదేశించారు. ప్రతి గ్రామ పంచాయతీలో ఉపాధి హామీ పనులను వేగవంతం చేయడంతోపాటు నీటి సంరక్షణ, చెరువుల పునరుద్ధరణ, భూగర్భ జలాల పెంపునకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసి గ్రామీణ ప్రజలకు భరోసా కల్పించాలని మంత్రి సూచించారు. బీఆర్కే భవన్‌లోని సెర్ప్ కార్యాలయం నుంచి బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి సీతక్క రాష్ట్రవ్యాప్తంగా సుమారు 12 వేల మంది సర్పంచులు, 12 వేల మంది పంచాయతీ కార్యదర్శులు, సంబంధిత అధికారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎల్‌నినోను ఎదుర్కొనేందుకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ రూపొందించిన ‘జలసిరి’ వీడియోను మంత్రి ఆవిష్కరించారు.
ఎల్‌నినో పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఫామ్ పాండ్లు, ఇంకుడు గుంతలు, బోర్వెల్ రీచార్జ్ పనులు, చెక్‌డ్యామ్ నిర్మాణం చేపట్టాలని సూచించారు. పశువులకు మేత, తాగునీటి కొరత రాకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. గ్రామాల్లో నీటి వృథాను అరికట్టేందుకు సర్పంచులు ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం అవసరమైన నిధులు అందుబాటులో ఉంచుతోందని మంత్రి సీతక్క తెలిపారు. ఒక్కో గ్రామానికి సుమారు రూ.50 లక్షల నుంచి రూ.కోటి వరకు నిధులు సమకూరే అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. కాగా ఉక్కు మహిళ ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా నవంబర్ 19న గ్రామ మహిళా సంఘ భవనాలను ప్రారంభించుకునేలా నిర్మాణ పనులను పూర్తి చేయాలని మంత్రి సీతక్క ఆదేశించారు.