భద్రాచలంలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు

26-10-2026 | 11:30pm

భద్రాచలం, (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా(Bhadradri Kothagudem District) భద్రాచలం పట్టణంలో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఈ శరత్ తన బృందంతో కలిసి వివిధ హోటళ్లు, ఆహార విక్రయ కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఆహార పదార్థాల నాణ్యత, పరిశుభ్రత, నిల్వ విధానాలు, ఆహార భద్రతా ప్రమాణాల అమలును పరిశీలించారు.

తనిఖీల సందర్భంగా నిబంధనల ఉల్లంఘనలు గుర్తించిన ఒక దుకాణాన్ని సీజ్ చేయడంతో పాటు, తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు కార్యకలాపాలు నిలిపివేయాలని సస్పెన్షన్ నోటీసు జారీ చేశారు. పరిశుభ్రత లోపాలు, ఇతర ఆహార భద్రతా నిబంధనల ఉల్లంఘనలు గుర్తించిన 3 హోటళ్లకు ఇంప్రూవ్‌మెంట్ నోటీసులు జారీ చేసి, లోపాలను నిర్దేశిత సమయంలో సరిదిద్దుకోవాలని ఆదేశించారు. తనిఖీలలో భాగంగా వివిధ ఆహార పదార్థాలకు సంబంధించి 7 నమూనాలను సేకరించి(లిఫ్ట్ చేసి) పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపేందుకు చర్యలు చేపట్టారు.

ఆహార వ్యాపారులు తప్పనిసరిగా ఆహార భద్రతా ప్రమాణాలను పాటించాలని, పరిశుభ్రతకు ప్రాధాన్యతనిస్తూ వినియోగదారులకు సురక్షితమైన, నాణ్యమైన ఆహారాన్ని అందించాలని ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ సూచించారు. ప్రజారోగ్య పరిరక్షణలో భాగంగా తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని తెలిపారు.

మరిన్ని వార్తలు