భారీ గంజాయి పట్టివేత
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ గంజాయి పట్టివేత
- 30 లక్షల విలువైన సరుకు స్వాధీనం, ఇద్దరి అరెస్ట్
భద్రాచలం,(విజయ క్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎక్సైజ్ శాఖ(Excise Department) అధికారులు భారీగా గంజాయిని స్వాధీనం(Ganja Seized) చేసుకున్నారు. సుమారు రూ. 30 లక్షల విలువైన గంజాయిని తరలిస్తున్న వాహనాలను సీజ్ చేసి, ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. బుధవారం ఎస్హెచ్ఓ భద్రాచలం పరిధిలో, డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి, కొత్తగూడెం ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాస రెడ్డి(Kothagudem Excise Superintendent Srinivasa Reddy) ఆదేశాల మేరకు అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎన్.శ్రీనివాస రావు ఆధ్వర్యంలో ఈ తనిఖీలు నిర్వహించారు.
బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు వీరభద్ర ఫంక్షన్ హాల్ వద్ద ఎస్హెచ్ఓ భద్రాచలం మరియు డిటిఎఫ్ కొత్తగూడెం సిబ్బంది సంయుక్తంగా తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో భాగంగా ఒక హీరో స్ప్లెండర్ బైక్ (రిజి. నెం. ఓ డి-30 హెచ్1783) లో తరలిస్తున్న 9 కేజీల గంజాయిని అధికారులు గుర్తించారు. ఒడిశా రాష్ట్రం మల్కన్‌గిరి, కలిమెల నుండి ఈ గంజాయిని మహారాష్ట్ర, ముంబైకి తరలిస్తున్నట్లు విచారణలో తేలింది.
దీనికి సంబంధించిన విచారణలో వెనక వస్తున్న మరో కారు (హ్యుందాయ్ వెర్నా - రిజి. నెం. ఏపీ 10 ఏపీ 8269) ను తనిఖీ చేయగా, అందులో దాదాపు 100 కేజీల గంజాయి లభించింది. పట్టుబడిన మొత్తం గంజాయి విలువ సుమారు రూ. 30 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. ఈ ఘటనలో మొత్తం 109 కేజీల గంజాయిని, 2 వాహనాలు (కారు మరియు బైక్), అలాగే 3 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ అయిన నిందితులలో ఒరిస్సా రాష్ట్రం కలిమెలకు చెందిన దివాకర్ మండల్, సుమన్ పాల్ ఉన్నారు.
ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోందని ఎక్సైజ్ అధికారులు తెలిపారు. ఈ ఆపరేషన్‌లో ఏఈఎస్ ఎన్ శ్రీనివాస రావు, డిటిఎఫ్ ఇన్స్పెక్టర్ రమాదేవి, భద్రాచలం ఎస్హెచ్ఓ కిష్టయ్య, ఎస్సై సలీముల్ అల్లూరి రాజా సీతారామ రాజు, సిబ్బంది కరీం, మౌలాంకర్, వీరబాబు, శ్రీనివాస్, నర్సింహారావు, రమేష్, పార్థసారథి, విల్సన్, సీతారాం, వీరభద్ర రావు, రాకేష్, కిరణ్, ప్రసన్న కుమార్ తదితరులు పాల్గొన్నారు.