కల్లూరులో జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఏర్పాటు చేయాలి
సీఎంకు న్యాయవాది రామనర్సింహారావు వినతి
కల్లూరు,(విజయక్రాంతి): కల్లూరు మండల కేంద్రంలో జుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు(Judicial First Class Magistrate Court)ను ఏర్పాటు చేయాలని కోరుతూ అడ్వకేట్ పి. రామనర్సింహారావు, కల్లూరు ప్రాంత ప్రజలు ముఖ్యమంత్రికి వినతిపత్రం సమర్పించారు. సత్తుపల్లి కోర్టుల్లో కల్లూరు ప్రాంతానికి చెందిన సుమారు 1,800 సివిల్, క్రిమినల్ కేసులు(Civil and criminal cases) పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు.
కల్లూరు నుంచి సరిహద్దు గ్రామాల ప్రజలు సత్తుపల్లి కోర్టుకు సుమారు 60 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోందన్నారు. కల్లూరు ప్రస్తుతం మున్సిపాలిటీగా అభివృద్ధి చెందడంతోపాటు 90 వేలకుపైగా జనాభా ఉందని, అదనపు కలెక్టర్, ఏసీపీ కార్యాలయాలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. కోర్టు ఏర్పాటుకు అవసరమైన ప్రభుత్వ భవనాలు, స్థలం అందుబాటులో ఉన్నందున సత్తుపల్లికి కేటాయించిన అదనపు జేఎఫ్‌సీఎం కోర్టును కల్లూరులో ఏర్పాటు చేయాలని కోరారు.