సిర్గాపూర్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

01-10-2026 | 12:22am

వార్షిక తనిఖీలలో భాగంగా సిర్గాపూర్ పోలీస్ స్టేషన్

పోలీస్ స్టేషన్, సర్కిల్ కార్యాలయ ఆవరణ పరిశుభ్రత, రికార్డుల నిర్వహణ, సిబ్బంది కిట్ ఆర్టికల్స్ పరిశీలన

స్టేషన్ రికార్డుల్లో ఎలాంటి పెండింగ్ లేకుండా చూడాలి.. సిబ్బంది సాంకేతిక పరిజ్ఞానంపై పట్టు సాధించాలి

సిర్గాపూర్ పోలీస్ స్టేషన్, కంగ్టీ సర్కిల్ కార్యాలయ అధికారులు, సిబ్బంది పనితీరు అభినందనీయం: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్

సిర్గాపూర్,(విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ పోలీస్ స్టేషన్(Sirgapur Police Station)ను జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా సిర్గాపూర్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించి, నారాయణఖేడ్ డీఎస్పీ వెంకట్ రెడ్డి(Narayankhed DSP Venkat Reddy), కంగ్టి సీఐ వెంకట్ రెడ్డితో కలిసి పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కను నాటారు. అనంతరం పోలీస్ స్టేషన్ పరిసరాల పరిశుభ్రత, సిబ్బంది కిట్ ఆర్టికల్స్, స్టేషన్ రికార్డుల నిర్వహణను పరిశీలించారు. పోలీస్ స్టేషన్ ఆవరణలో ఉన్న స్వాధీనం చేసుకొని ఉన్న సంబంధించిన వాహనాలు, కేసులకు వివరాలను అడిగి తెలుసుకున్నారు.

కేసులకు సంబంధించిన ఆస్తులను కోర్టులో సమర్పించే వరకు జాగ్రత్తగా భద్రపరచాలని సూచించారు. స్టేషన్ రికార్డులను పరిశీలిస్తూ ప్రతి రికార్డును ఎప్పటికప్పుడు అప్‌డేట్‌గా ఉంచాలని, స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదును ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ఆదేశించారు. స్టేషన్ పరిధిలో జరిగిన నేరాలను పార్ట్–II మ్యాప్‌లో గుర్తించాలని, ఆస్తి సంబంధిత నేరాలు అధికంగా జరిగే ప్రాంతాలను క్రైమ్ ప్రోన్ ఏరియాలు/బ్లాక్ స్పాట్లుగా గుర్తించి, పగలు, రాత్రి బీట్ విధుల్లో నిఘాను పెంచాలని సూచించారు. దర్యాప్తులో ఉన్న కేసులను పరిశీలించిన ఎస్పీ, ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తు చేపట్టాలని సూచించారు.

మిస్సింగ్ కేసులు, దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసుల పరిష్కారానికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించి, వాటిని త్వరితగతిన ఛేదించాలని ఆదేశించారు. రాష్ట్ర సరిహద్దుల నుంచి ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టే అక్రమ రవాణా జరగకుండా చెక్‌పోస్టుల నిర్వహణను పకడ్బందీగా చేపట్టాలని ఎస్‌హెచ్‌ఓ (ఎస్సై) మహేష్ కు సూచించారు. సీసీటీఎన్ఎస్-2.0, పిటిషన్ మేనేజ్‌మెంట్ సిస్టమ్, టీఎస్-కాప్, హెచ్‌ఆర్‌ఎంఎస్, ఈ-సాక్ష్య, టెక్ డాటం, ఐరాడ్ దర్పణ్, సీఈఐఆర్, సైబర్ క్రైమ్ పోర్టల్, సీడీఆర్, పోర్టబుల్ ఫింగర్ ప్రింట్ డివైస్ వంటి సాఫ్ట్‌వేర్ అప్లికేషన్లపై సిబ్బంది పూర్తి స్థాయి పట్టు సాధించి, నేరాల నియంత్రణ, దర్యాప్తులో వాటిని సమర్థవంతంగా వినియోగించాలని సూచించారు.

స్టేషన్ రికార్డులైన పార్ట్–1 నుంచి పార్ట్–5 వరకు ఎలాంటి పెండింగ్ లేకుండా సిసిటీఎన్ఎస్ -2.0లో ఎప్పటికప్పుడు నమోదు చేయాలని ఆదేశించారు. అనంతరం సిబ్బందితో మాట్లాడుతూ, స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా మాట్లాడి, వారి సమస్యలను పరిష్కరిస్తామనే భరోసా కల్పించాలని సూచించారు. విలేజ్ పోలీస్ అధికారులు తమకు కేటాయించిన గ్రామాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, గ్రామ పెద్దలు, యువతతో సత్సంబంధాలు కలిగి శాంతిభద్రతలకు సంబంధించిన ముందస్తు సమాచారాన్ని సేకరించాలని అన్నారు.

పోలీస్ స్టేషన్ పరిధిలోని సస్పెక్ట్, హిస్టరీ షీటర్ల వివరాలపై సిబ్బంది పూర్తి అవగాహన కలిగి ఉండాలని, పగలు, రాత్రి బీట్ విధుల్లో హిస్టరీ షీటర్లను తనిఖీ చేస్తూ వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేయాలని సూచించారు. పాపిలాన్ డివైస్‌ను వినియోగిస్తూ అనుమానిత వ్యక్తులను తనిఖీ చేయడంతో పాటు, వేలిముద్రల ద్వారా పాత నేరస్తులను గుర్తించాలని సూచించారు.

మారుతున్న సమాజానికి అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని, ప్రతి పోలీస్ సిబ్బంది అన్ని రకాల విధులపై అవగాహన కలిగి ఉండాలని, తమకు కేటాయించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని ఎస్పీ సూచించారు. విధి నిర్వహణలో (లేదా) వ్యక్తిగతంగా ఏవైనా సమస్యలు ఉంటే నేరుగా తన దృష్టికి తీసుకురావచ్చని తెలిపారు. వాహనాలు నడిపే సమయంలో తప్పనిసరిగా హెల్మెట్, సీట్‌బెల్ట్ ధరించాలని సూచించారు. ఎస్పీ వెంట నారాయణఖేడ్ డీఎస్పీ వెంకట్ రెడ్డి, కంగ్టీ సీఐ వెంకట్ రెడ్డి, సిర్గాపూర్ ఎస్‌ఐ మహేష్, సర్కిల్ ఎస్‌ఐలు తదితరులు ఉన్నారు.

మరిన్ని వార్తలు