తుఫాను బాధితులకు ఎమ్మెల్యే పాయం పరామర్శ

25-09-2026 | 12:52pm

బూర్గంపాడు,(విజయక్రాంతి): బూర్గంపాడు మండలంలోని మొరంపల్లిబంజర, వేపలగడ్డ గ్రామాల్లో బుధవారం వీచిన ఈదురుగాలులు, భారీ వర్షాలతో జరిగిన నష్టాన్ని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు(MLA Payam venkateshwarlu) గురువారం అధికారులతో కలిసి పరిశీలించారు. దెబ్బతిన్న ఇళ్లు, ఇతర ప్రాంతాలను పరిశీలించి బాధిత కుటుంబాలతో మాట్లాడి నష్ట వివరాలు తెలుసుకున్నారు. తుఫాను ప్రభావంతో స్వల్పంగా గాయపడిన వారిని పరామర్శించి, అవసరమైన వైద్యసాయం అందించాలని అధికారులను ఆదేశించారు. పూర్తిగా, పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్లను క్షేత్రస్థాయిలో పరిశీలించి నష్టాలను నమోదు చేయాలని సూచించారు.

ఇళ్లు కోల్పోయిన అర్హులైన బాధితులకు ఇందిరమ్మ ఇళ్ల పథకం(Indiramma Indlu Scheme) ద్వారా ఇళ్లు మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యుత్‌ అంతరాయాలను వెంటనే సరిచేసి సరఫరాను పునరుద్ధరించాలని, తాగునీటి సమస్యలు లేకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు అవసరమైన సాయం త్వరితగతిన అందేలా చూడాలని సూచించారు. ప్రకృతి వైపరీత్యంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని పాయం భరోసా ఇచ్చారు. ఎమ్మెల్యే వెంటా తహశీల్దార్ ప్రసాద్, ఎంపీడీవో జమలారెడ్డి, మండల అధ్యక్షుడు పూలపెల్లి సుధాకర్ రెడ్డి,సర్పంచులు బొర్రా సుభద్ర,నిరోషా కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు