మంటల్లో దగ్ధమైన ప్రైవేట్ బస్సు
40 మంది ప్రయాణికులు సురక్షితం
శ్రీశైలం వెళ్తుండగా ప్రమాదం
రంగారెడ్డి జిల్లా మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన
ఎల్బీనగర్, సెప్టెంబర్ 24 (విజయక్రాంతి): అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో బస్సు దగ్ధమైన ఘటన రంగారెడ్డి జిల్లా మీర్‌పేట్ పోలీస్ స్టేషన్(Meerpet Police Station) పరిధిలోని మందమల్ల మ్మ చౌరస్తాలో గురువారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. సీఐ శోభన్ తెలిపిన వివరాల మేరకు నాగోల్ ప్రాంతానికి చెందిన శ్రీ మహాలక్ష్మి రియల్ ఎస్టేట్‌కు చెందిన సుమారు 150 మంది గణేశ్ విగ్రహ నిమజ్జనం, దర్శనం కోసం మూడు బస్సుల్లో శ్రీశైలం తరలివెళ్లారు.
బుధవారం రాత్రి మందమల్లమ్మ చౌరస్తా - గాయత్రీ నగర్ సమీపంలోని హెచ్‌పీ పెట్రోల్ బంక్‌లో రెండు బస్సులు డీజిల్ నింపుకోవడానికి వెళ్లాయి. ప్రధాన రహదారిపై నిలిపి ఉన్న మరో బస్సు(టీఎస్15టీ8595)లో కుడివైపు ఇంజిన్ భాగం నుంచి అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.మంటలను గమనించిన డ్రైవర్ వెంటనే బస్సు దిగి ప్రయాణికులను అప్రమత్తం చేయడంతో.. అందరూ సురక్షితంగా బయటకు వచ్చారు. ప్రమాదానికి గురైన 40 మంది ప్రయాణికులు ఉండగా, అందరూ సురక్షితంగా కిందికి దిగారు.
ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం లేదా గాయాలు సంభవించలేదని, బస్సు పూర్తిగా దగ్ధమై భారీగా నష్టం వాటిల్లిందని పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఎల్బీనగర్, మలక్ పేటకు చెందిన అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. బస్సులో మంటలు చెలరేగడానికి కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు మీర్‌పేట్ పోలీసులు పేర్కొన్నారు.