సర్టిఫికెట్ల జారీలో జాప్యం వద్దు
- ఆర్‌ఐ-2ను శాశ్వతంగా ఏర్పాటు చేయాలి
ఇల్లెందు, (విజయక్రాంతి): సర్టిఫికెట్ల కోసం వచ్చే ప్రజలు, ముఖ్యంగా విద్యార్థులు ఇబ్బందులు పడకుండా సకాలంలో ధ్రువపత్రాలు జారీ చేయాలని ఇల్లందు నియోజకవర్గ(Illandu Constituency) టీడీపీ కోఆర్డినేటర్ ముద్రగడ వంశీ, సర్పంచ్ చాందావత్ రమేష్‌బాబు కోరారు. ఈ మేరకు టీడీపీ(Telugu Desam Party) నాయకులు ఇల్లందు తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇల్లందు మండల, పట్టణాలకు ఒకే ఆర్‌ఐ ఉండటంతో సర్టిఫికెట్ల జారీలో జాప్యం జరుగుతోందన్నారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఆర్‌ఐ-2ను శాశ్వతంగా ఏర్పాటు చేయాలని కోరారు.
విద్యార్థులకు అవసరమైన ధ్రువపత్రాల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. తహసీల్దార్ స్పందిస్తూ ప్రస్తుతం సర్టిఫికెట్లు పెండింగ్‌లో లేకుండా ఎప్పటికప్పుడు పరిశీలించి పరిష్కరిస్తున్నామని తెలిపారు. ఎవరైనా ఇబ్బంది పడితే నేరుగా తనను సంప్రదించాలని సూచించారు. ఆర్‌ఐ-2ను శాశ్వతంగా ఏర్పాటు చేసే విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో టీఎన్‌ఎస్‌ఎఫ్, టీడీపీ పట్టణ ఉపాధ్యక్షుడు దాసరి గోపాలకృష్ణ, గుగ్గల రాజేష్, ముక్కు శ్రీవేద్, పొదిల శ్యామ్, బాసాని నవీన్, భాస్కర్, బెజ్జంకి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.