కలం పట్టాల్సిన చేతులతో.. వంటపనులా?
బాన్సువాడ, సెప్టెంబర్ 11 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ(Banswada) మండలం కొయ్యగుట్ట బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థినీలతో వంట పనులు చేయిస్తున్నారన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. విద్యార్థినీలు పూరీల తయారీలో పాల్గొంటున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. దీంతో విద్యార్థినీల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చదువుపై దృష్టి సారించాల్సిన విద్యార్థినీలను వంట పనులకు ఎందుకు వినియోగించారో ఉన్నతాధికారులు సమగ్రంగా విచారించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
వంట సిబ్బంది అందుబాటులో ఉన్నప్పటికీ విద్యార్థినీలతో పనులు చేయించడం వెనుక కారణాలను తేల్చాలని కోరుతున్నారు. ఆరోపణల్లో వాస్తవం ఉంటే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. విద్యార్థినీలతో పనులు చేయించలేదు: విద్యార్థినీలతో వంట పనులు చేయిస్తున్నారన్న ఆరోపణలపై పాఠశాల ప్రిన్సిపాల్ లక్ష్మీబాయిని వివరణ కోరగా, అలాంటి పనులు చేయించడం లేదని తెలిపారు. అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోలపై ఆమె స్పష్టత ఇవ్వలేదు.