ప్రమాదకరంగా సీతారామ కెనాల్ వంతెన!
తక్షణం మరమ్మతులు చేపట్టాలని ప్రజాసంఘాల డిమాండ్
బూర్గంపాడు,సెప్టెంబర్17,(విజయక్రాంతి): కొత్తగూడెం–భద్రాచలం జాతీయ రహదారిలో జింకలగూడెం వద్ద సీతారామ ప్రాజెక్టు(Sitarama Project) ప్రధాన కాలువపై ఉన్న వంతెన ప్రమాదకరంగా మారింది. వంతెనపై గుంతలు ఏర్పడి ఇనుప రాడ్లు బయటకు తేలడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు కే.బ్రహ్మచారి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి రేపాకుల శ్రీనివాస్, డీవైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కాలంగి హరికృష్ణ తదితరులు తెలిపారు.
వంతెనను గురువారం పరిశీలించిన నాయకులు.. రాత్రివేళల్లో గుంతలు, బయటకు వచ్చిన రాడ్ల కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. అంతర్రాష్ట్ర రాకపోకలకు కీలకమైన రహదారిపై ఇలాంటి పరిస్థితి ఉండటం ఆందోళనకరమన్నారు. జిల్లా కలెక్టర్, జాతీయ రహదారుల అధికారులు వెంటనే స్పందించి వంతెనకు మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేకపోతే ప్రజాసంఘాల ఆధ్వర్యంలో రహదారి దిగ్బంధనం చేపడతామని హెచ్చరించారు.