చిట్టీల పేరుతో మోసం.. భయాందోళనలో జనం!

19-10-2026 | 05:20am
  1. పైసా పైసా కూడబెట్టి ఇస్తే.. నిలువునా ముంచుతున్న వైనం
  2. టేకులపల్లి మండలంలో ప్రైవేటు చిట్టీల నిర్వహణపై పెరుగుతున్న ఆందోళన

టేకులపల్లి, అక్టోబర్ 18 (విజయక్రాంతి):  కష్టపడి సంపాదించిన సొమ్మును భవిష్యత్తు అవసరాల కోసం పైసా పైసా కూడబెట్టి చిట్టీల రూపంలో దాచుకుంటున్న సామాన్య ప్రజలకు ప్రైవేటు చిట్టీల వ్యవహారం(Tekulapalli Chit Fund) ఆందోళన కలిగిస్తోంది.

టేకులపల్లి మండలంలో కొందరు చిట్టీ వ్యాపారుల వ్యవహార శైలిపై అనుమానాలు వ్యక్తమవుతుండటంతో, ప్రైవేటు చిట్టీలు(Tekulapalli Chit Fund) వేయాలంటేనే ప్రజలు భయపడుతున్న పరిస్థితి నెలకొంది. అధిక కమిషన్లు, ఆర్థిక లాభాల ఆశతో చిట్టీల వ్యాపారం నిర్వహిస్తున్న కొందరి కారణంగా సామాన్యులు నష్టపోతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

కమిషన్లే లక్ష్యంగా.. ప్రజల సొమ్ముకు భద్రత ఏదీ?

కుటుంబ అవసరాలు, పిల్లల చదువులు, వివాహాలు, వైద్య ఖర్చుల కోసం ప్రజలు తమకు వచ్చిన ఆదాయంలో కొంత మొత్తాన్ని చిట్టీల్లో జమ చేస్తుంటారు. నెలనెలా క్రమం తప్పకుండా చిట్టీ సొమ్ము చెల్లిస్తూ, అవసరమైన సమయంలో డబ్బులు చేతికి అందుతాయని ఆశిస్తారు. అయితే చిట్టీ నిర్వహణలో పారదర్శకత లోపించినా, నిర్వాహకులు సకాలంలో చెల్లింపులు చేయకపోయినా, చివరకు నష్టపోయేది మాత్రం చిట్టీదారులే. నమ్మకంతో డబ్బులు అప్పగించిన ప్రజలు తమ సొమ్ము తిరిగి వస్తుందో లేదోనని ఆందోళన చెందాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.

కోట్ల రూపాయల మోసం జరిగిందనే ఆరోపణలు!

టేకులపల్లి మండలంలో ఇప్పటికే ఓ చిట్టీ వ్యాపారి కోట్ల రూపాయల మేర ప్రజలను నష్టపరిచినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారం స్థానికంగా చర్చనీయాంశంగా మారడంతో, ఇతర ప్రైవేటు చిట్టీల్లో డబ్బులు పెట్టినవారిలోనూ ఆందోళన పెరుగుతోంది. అయితే ఈ వ్యవహారంలో అసలు బాధితుల సంఖ్య ఎంత? ఎంతమేర సొమ్ము చేతులు మారింది? బాధితులకు డబ్బులు తిరిగి అందుతాయా? అనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది. ఆరోపణలపై సంబంధిత అధికారులు విచారణ చేపట్టి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది.

అధికారులు స్పందించాలి: బాధితులకు న్యాయం చేయాలి ప్రైవేటు చిట్టీల పేరుతో సామాన్య ప్రజల కష్టార్జితం ప్రమాదంలో పడకుండా సంబంధిత అధికారులు పర్యవేక్షణను పెంచాలని స్థానికులు కోరుతున్నారు. చిట్టీల నిర్వహణకు అవసరమైన అనుమతులు, నిబంధనలు పాటిస్తున్నారా లేదా అన్నది పరిశీలించాలని, అక్రమాలు జరిగినట్లు తేలితే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

మోసపోయిన బాధితులు ముందుకు వచ్చి ఫిర్యాదు చేస్తే, వారి ఫిర్యాదులను పరిశీలించి న్యాయం జరిగేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. ప్రజలు కూడా అధిక లాభాల ఆశతో లేదా పరిచయస్తుల మాటలు నమ్మి డబ్బులు అప్పగించకుండా, చిట్టీ నిర్వహణకు సంబంధించిన చట్టబద్ధత, రశీదులు, ఒప్పందాలు, చెల్లింపుల వివరాలను పరిశీలించాలి. ప్రజల నమ్మకమే పెట్టుబడిగా సాగుతున్న చిట్టీల వ్యాపారంలో ఆ నమ్మకాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత నిర్వాహకులదే.

సామాన్యుల కష్టార్జితం కాపాడేందుకు అధికారులు ఇప్పటికైనా స్పందిస్తారా? అన్నది వేచి చూడాలి. మండలంలో రూ. లక్షల్లో చిట్టీలు నిర్వహిస్తున్న వాటికి ఎలాంటి ప్రభుత్వాలు మొత్తం లేకపోవడం గర్హనీయం. సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం దీనికి కారణం అని నష్టపోయిన లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు