బతుకమ్మను బతుకనియ్యాలె!
అడవే ఇల్లు.. ప్రకృతే జీవన విధానం. ఆచారాలు, సంప్రదాయాలే ఊపిరిగా బతికే కోదు గిరిజనుల జీవితాన్ని కళ్లకు కట్టినట్లు ఆవిష్కరించిన నవల ‘అమృత సంతానం’(Amruta Santanam Novel)(రోణంకి అప్పలస్వామి తెలుగు అనువాదం). జ్ఞానపీఠ పురస్కార గ్రహీత, ప్రఖ్యాత ఒడిశా రచయిత గోపీనాథ్ కలం నుంచి జాలువారిన ఈ రచన కోదు గిరిజన సంస్కృతికి అద్దం పడుతోంది. ఈ నవలలో పుయి (పువ్వు) అనే యువతి పాత్ర ద్వారా కోదు గిరిజనుల మాతృత్వ సంప్రదాయాన్ని రచయిత వర్ణించిన తీరు అమోఘం.
‘పుయి’ నాయకుని రెండవ భార్య. చిన్న వయసులోనే తల్లి అవుతుంది. అడివిలోనే పురిటినొప్పులు వస్తే అడవిలో సెలయేటి ఒడ్డున ప్రసవించి, బిడ్డ బొడ్డు కోసి, మావిని నీటిలో వదిలి, ఒడ్డున చెట్ల పూలు తెంపి నీళ్లలో వేసి దండం పెట్టుకుంటుంది. మాతృత్వ సంప్రదాయం ‘పుయి’కి చిన్న వయసులోనే తెలిసింది. ప్రసవాన్ని ‘నీళ్లాడటం’గా పిలిచే గిరిజన సంప్రదాయాన్ని ఇంతటి సహజత్వంతో ఆవిష్కరించడం ఈ నవల ప్రత్యేకత. ‘నీళ్లాడటం’ను ఇంత వివరంగా మరెవ్వరూ చెప్పలేదు.
ఈ కథలో పుయి అంటే పువ్వు. ఆమె సెలయేటిలో నీళ్లాడి, మావిని, పూలను నీటిలో నిమజ్జనం చేస్తుంది. ఇది కోదు గిరిజన సంస్కృతికి, మన జీవన సంప్రదాయాలకు మధ్య ఉన్న సంబంధాన్ని తెలియజేస్తున్నది. వారు మాట్లాడే భాష ‘కుయి’. తెలుగు సోదరి భాష. రెండూ ఒకే భాషా కుటుంబానికి చెందినవి. భాష అంటేనే సంస్కృతి. ఈ సాంస్కృతిక అనుబంధం ఎన్ని వందల ఏళ్ల నాటితో పరిశోధన చేస్తే దొరవవచ్చు. ఈ సన్నివేశంలో మాతృత్వం, అమ్మతనం, ప్రకృతి.. మూడూ మమేకమై ఉన్నాయి. కానీ, ఈ సంస్కృతి ఒక పండుగ ఎందుకు కాదు? పండుగంటేనే ఒక సాంస్కృతిక ఆచారం, సంప్రదాయం అనేది తర్వాత కాలంలో సామాజిక స్థిరీకరణలో ఏర్పడుతుంది. బతుకమ్మకు. ఈ సంస్కృతికి సంబంధం ఉన్నదనిపించింది నాకు.
వేములవాడ శివలింగాన్ని చోళులు ఎత్తుకపోవడం, ఆ బృహదీశ్వరుని పత్ని ‘బృహదమ్మ’(కుదరని సమాసం) ఈశ్వరునికి దూరమైనదని, అందుకే బతుకమ్మ పండుగ జరుపుకుంటున్నారనే పుక్కిటి పురాణా లను ప్రచారం చేసే యూట్యూబ్ పండితులకు ఓ దం డం. ‘కథకు కాళ్లు లేవు, ముంతకు చెవుల్లేవు’ అనేది తెలంగాణ సామెత. ఎందుకు చెప్తారో ఈ కథలింత ఆకర్షణీ యంగా. ఒక అమ్మభావనను కల్పితం చేస్తున్న మేధావులకు ఎన్నిదండాలు పెట్టినా తక్కువే. పతిలేక సతి దురపి ల్లిందనే కథకు బృహదీశ్వరాలయంలో శివుణ్ణి కౌగలించుకున్న పార్వతి శిల్పం చెంపపెట్టు కావాలి. ఎపుడు తెలుస్తుంది కనుక.
ఒక గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డు గ్రహీత. తారీఖులు, స్థలాలు, సంఘటనలన్నీ చారిత్రకమన్నంత గొప్ప గా చెప్పడమే కాదు, బతుకమ్మ విగ్రహాన్ని చెక్కించి త్వరలో గుడి కట్టబోతున్నారని చెప్పారు. బతుకమ్మను కూష్మాండినీ దేవతన్నారు, గౌరీ దేవతన్నారు. ఇపుడీయన త్రిశక్తి రూపమంటున్నాడు. బతుకమ్మ ఏ మత దేవత? అమ్మదేవతలకున్న మతం ఏమిటి? ప్రపంచవ్యాప్తంగా వున్నవాటిని కుదించి, మతారోపణలు చేయడం ఎంతవరకు సమంజసం?. పుక్కిటి పురాణం చేప్పే సార్లు ఆఖరికి బతుకమ్మను కూడా వదలడం లేదు. తోక లేకు న్నా పులికథలు చెప్పే ప్రతిభావంతులతో ఒక పురాతన సంస్కృతి భంగపడిపోతున్నది.
బతుకమ్మను కాపాడండి. ఒక ప్రాంతానికి చెందిన ఈ ఆరాధనా రూపం వెనక ఆ ప్రాంత జనులు టోటమిక్ రూపముంటుంది. అది.. ఆ తెగ, జాతి జనులకు చెందింది. వ్యాప్తికి అనేక కారణాలుంటాయి. పుట్టు కకు కాదు. బతుకమ్మ తెలంగాణలోని ఏ సముదాయం నుంచి వచ్చిందో పరిశోధన జరగాలి.
కన్వీనర్, కొత్త తెలంగాణ చరిత్రబృందం