హిందూ మహిళలపై అనుచిత వ్యాఖ్యలు
హరగోపాల్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి
రావు పద్మా రెడ్డి
* తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నేరేళ్ల శారద కి వినతిపత్రం సమర్పించిన బిజెపి ,హిందూ సంఘాల నాయకులు.
హనుమకొండ, అక్టోబర్ 9(విజయ క్రాంతి): కాకతీయ విశ్వవిద్యాలయంలో(Kakatiya University) గురువారం జరిగిన ఒక సమావేశంలో హిందూ మహిళలను, హిందూ ధర్మాన్ని(Hindu women, Hinduism) ఉద్దేశించి అత్యంత దిగజారుడు, విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసిన ప్రొఫెసర్ హరగోపాల్‌పై(Professor Haragopal), అలాగే ఈ కార్యక్రమానికి అనుమతి ఇచ్చిన కాకతీయ యూనివర్సిటీ అధికారులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని బిజెపి వరంగల్ పశ్చిమ నియోజకవర్గ నాయకురాలు రావు పద్మా రెడ్డి(Rao Padma Reddy) డిమాండ్ చేశారు.
శుక్రవారం హనుమకొండ జిల్లా పర్యటనకు విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నేరేళ్ల శారద(Nerella Sarada) ని, రావు పద్మా రెడ్డి ఆధ్వర్యంలో బిజెపి, వివిధ హిందూ సంఘాల ప్రతినిధులు నేరుగా కలిసి వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా రావు పద్మా రెడ్డి మాట్లాడుతూ విద్యానగరంగా ప్రసిద్ధి చెందిన కాకతీయ విశ్వవిద్యాలయ ప్రాంగణంలో, హక్కుల నేత పేరుతో చలామణి అవుతున్న అర్బన్ నక్సల్ ప్రొఫెసర్ హరగోపాల్ హిందూ మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడటం తీవ్రంగా ఖండించదగిన విషయమన్నారు.
సమాజంలో శాంతియుతంగా జీవిస్తున్న మహిళలను, వారి విశ్వాసాలను లక్ష్యంగా చేసుకుని విద్వేషాలు రెచ్చగొట్టడం క్షమించరాని నేరమని పేర్కొన్నారు. అలాగే, జ్ఞానానికి, విద్యాబోధనకు కేంద్రంగా ఉండాల్సిన కాకతీయ విశ్వవిద్యాలయంలో అర్బన్ నక్సల్ భావజాలం ఉన్న వ్యక్తులకు, వివాదాస్పద సభలకు అనుమతులు ఇచ్చి వాతావరణాన్ని విషతుల్యం చేస్తున్న విశ్వవిద్యాలయ అధికారుల తీరుపై ఆమె తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
హిందూ మహిళల గౌరవానికి భంగం కలిగించిన ప్రొఫెసర్ హరగోపాల్‌పై మహిళా కమిషన్ తక్షణమే సుమోటోగా కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి అని, విద్వేషపూరిత కార్యక్రమానికి కేయూ ప్రాంగణాన్ని వేదికగా మార్చేందుకు అనుమతులిచ్చిన సంబంధిత విశ్వవిద్యాలయ అధికారులపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలి అని, మహిళా రక్షణ,గౌరవాన్ని నిలబెట్టే అత్యున్నత వ్యవస్థగా ఉన్న రాష్ట్ర మహిళా కమిషన్ ఈ అంశంపై స్పందించి, తక్షణమే న్యాయం చేయాలని రావు పద్మా రెడ్డి కోరారు.
ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా నాయకులు సండ్ర మధు, తోపుచెర్ల అర్చన మధుసూదన్ రావు, ఆకుల శ్రీకాంత్ పటేల్, నర్మెట్ట శ్రీనివాస్ రావు గౌడ్, తిరుపతి నాయక్, పున్నం వేణు, ఆదిత్య సాయి, పెరుగు సురేష్, ఆడెపు రాజు, జితేందర్, రోకుల సతీష్, చల్ల జైపాల్ రెడ్డి, హిందూ సంఘాల ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.