ఎల్‌నినో ఎఫెక్ట్.. తుమ్మల కీలక ఆదేశాలు

09-10-2026 | 03:20pm

ఎల్‌నినో ఎఫెక్ట్.. ఉద్యాన పంటలపై తెలంగాణ ఫోకస్

10 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు లక్ష్యం..

కోకో కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు

హైదరాబాద్: ఎల్‌నినో ప్రభావ(El Nino Effect) పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులకు ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన కల్పించడంతో పాటు ఉద్యాన పంటలను ప్రోత్సహించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Tummala Nageswara Rao) అధికారులకు సూచించారు. శుక్రవారం సచివాలయంలో ఉద్యాన శాఖ, ఆయిల్ ఫెడ్ అధికారులతో నిర్వహించిన సమీక్షలో పలు కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు.

రాష్ట్రంలో ఉద్యాన పంటల(Telangana horticultural crops ) సాగు విస్తీర్ణం పెరగడంపై మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. కూరగాయల ఉత్పత్తిని పెంచి, తెలంగాణ నుంచి ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసే స్థాయికి చేరుకోవాలని సూచించారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు, మెరుగైన మార్కెటింగ్ సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు.

10 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్

రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగు(Oil palm cultivation )కు అనుకూలంగా ఉన్న భూములను వినియోగించుకుని కనీసం 10 లక్షల ఎకరాల్లో ఈ పంట సాగయ్యేలా ప్రణాళిక రూపొందించాలని మంత్రి తెలిపారు. ఏటా రెండు లక్షల ఎకరాల్లో సాగు చేపట్టే లక్ష్యంతో అధికారులు, కంపెనీలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. నిర్మాణంలో ఉన్న ఆయిల్ పామ్ ఫ్యాక్టరీలను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు.

కోకో రైతులకు కొనుగోలు కేంద్రాలు

ఆయిల్ పామ్ తోటల్లో అంతరపంటగా కోకో సాగును విస్తరించేందుకు చర్యలు తీసుకోవాలని తుమ్మల సూచించారు. తొలిదశలో అశ్వారావుపేట, దమ్మపేట ప్రాంతాల్లో కోకో కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు.

యాంత్రీకరణ, నియామకాలపై ఆదేశాలు

వ్యవసాయ(Agriculture), ఉద్యాన శాఖల్లో అమలవుతున్న వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని ఏకీకృత నోడల్ ఏజెన్సీ ద్వారా అమలు చేయాలని మంత్రి సూచించారు. ఆయిల్ ఫెడ్‌లో ఖాళీల భర్తీ ప్రక్రియను వేగవంతం చేసి, నియామకాలకు సంబంధించిన చర్యలను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. సమీక్షా సమావేశంలో వ్యవసాయ శాఖ కార్యదర్శి కె. సురేంద్రమోహన్, ఉద్యాన శాఖ, ఆయిల్ ఫెడ్ ఎండీలు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు