ప్రజల అభ్యున్నతి, అభివృద్ధే ప్రజా ప్రభుత్వ ధ్యేయం: ఎమ్మెల్యే నాయిని

03-10-2026 | 07:55pm

రూ.2.60 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన

హనుమకొండ,(విజయక్రాంతి): వరంగల్ పశ్చిమ నియోజకవర్గం(Warangal West constituency)లో పార్టీలకు అతీతంగా ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి(MLA Nayini Rajender Reddy) అన్నారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన గడిచిన 33 నెలల్లో నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు.

శనివారం 31వ డివిజన్ పరిధిలోని అవంతి స్కూల్ కాలనీ, హంటర్ రోడ్ విశాల్ మార్ట్ ఆవరణ, సూర్యోదయ కాలనీ, శ్రీరామ్ హిల్స్, హంటర్ హిల్స్ రోడ్ నంబర్ 3 ప్రాంతాల్లో సుమారు రూ.2.60 కోట్లతో చేపట్టనున్న అంతర్గత రోడ్లు, సైడ్ డ్రైనేజీ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే నాయిని శంకుస్థాపన చేశారు. స్థానిక ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కాలనీ ప్రజలు, సంబంధిత అధికారులతో కలిసి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని మాట్లాడుతూ ప్రజల అవసరాలను గుర్తించి ప్రతి డివిజన్‌లో ప్రాధాన్యత క్రమంలో రోడ్లు, డ్రైనేజీలు, మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం నిధులు కేటాయిస్తోందన్నారు. నియోజకవర్గంలో ఇప్పటికే చేపట్టిన అభివృద్ధి పనులతో పాటు అవసరమైన ప్రాంతాల్లో కొత్త పనులను కూడా వేగంగా చేపడుతున్నామని తెలిపారు.ప్రజల అభ్యున్నతి, నియోజకవర్గ సమగ్ర అభివృద్ధే ప్రజా ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

అభివృద్ధి పనులు జరుగుతుండటాన్ని చూసి ఓర్వలేని ప్రతిపక్షాలు ప్రజలను తప్పుదోవ పట్టించేలా తప్పుడు ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని, క్షేత్రస్థాయిలో జరుగుతున్న అభివృద్ధి పనులను ప్రజలు స్వయంగా పరిశీలించాలని కోరారు. నియోజకవర్గంలోని ప్రతి డివిజన్‌లో ప్రజలకు అవసరమైన మౌలిక వసతులను కల్పించేందుకు నిరంతరం కృషి చేస్తామని ఎమ్మెల్యే నాయిని తెలిపారు.

అభివృద్ధి పనుల నాణ్యత విషయంలో రాజీ లేకుండా అధికారులు పర్యవేక్షించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పీసీసీ మెంబర్ బత్తిని శ్రీనివాస్ రావు,డివిజన్ ఇంచార్జ్ మార్క విజయ్ కుమార్,మాజీ కార్పొరేటర్ మామిండ్ల రాజు,వేల్పుల మోహన్ రావు, జిల్లా నాయకులు మామిండ్ల సురేష్,డివిజన్ అధ్యక్షుడు సత్తు రమేష్,మాజీ అధ్యక్షులు సురేందర్, నాయకులు వేణు,కృష్ణ,అభిలాష్ స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు