గణేష్ నిమజ్జనం ఫినిష్.. ఇప్పుడు జ్ఞానేశ్ నిమజ్జనం!
హైదరాబాద్: ఈ పోరాటం కేవలం ఓటు హక్కును కాపాడుకోవడం కోసమే కాదని నటుడు ప్రకాశ్ రాజ్(Prakash Raj) అన్నారు. ఓటు హక్కుతో పాటు రాజ్యాంగం పౌరులకు కల్పించిన స్వేచ్ఛ, సమానత్వం వంటి ప్రాథమిక హక్కులను పరిరక్షించుకోవడమే అసలైన ఉద్దేశమని పేర్కొన్నారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం ఎవరినీ నమ్ముకోవాల్సిన అవసరం లేదని.. ఏ రాజకీయ పార్టీపై ఆధారపడాల్సిన పనిలేదని అన్నారు. పౌరులుగా ప్రజలే స్వచ్ఛందంగా స్పందించి రోడ్డెక్కి తమ నిరసనను తెలియజేయాలని పిలుపునిచ్చారు.
ఓటు హక్కు సవరణ, పరిశీలన ప్రక్రియతో పాటు దేశంలో జరుగుతున్న పరిణామాలపై ప్రజలు స్పందించాలని కోరారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ గళం విప్పాలని ప్రకాశ్ రాజ్ అన్నారు. ఇదే సందర్భంలో ఆయన.. “మొన్నటి వరకు గణేష్ నిమజ్జనం జరిగింది.. ఇప్పుడు జ్ఞానేష్ కుమార్ నిమజ్జనం కావాలి” అంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి.