తెలంగాణ అస్తిత్వ వేదిక రాష్ట్రస్థాయి సమావేశం
తెలంగాణ అస్తిత్వమే ప్రశ్నాకర్థంలో పడింది: తెలంగాణ అస్తిత్వ వేదిక చైర్మన్ వీరమళ్ల ప్రకాష్
హనుమకొండ, అక్టోబర్ 2 (విజయక్రాంతి): తెలంగాణలో స్వయం పాలన పోయి,పరాయి పాలన వచ్చిందని, రాష్ట్రo మనదే అయినా,పాలన మాత్రం అంధ్రా కనుసన్నల్లోనే జరుగుతోందని తెలంగాణ అస్తిత్వ వేదిక చైర్మన్ వీరమళ్ల ప్రకాష్(Chairman Veeramalla Prakash) అన్నారు. ఆర్గనైజేషన్ ఫర్ బ్యాక్ వర్డ్ క్లాసెస్ చైర్మన్, కుడా మాజీ చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్ ఆధ్వర్యంలో తెలంగాణ అస్తిత్వ వేదిక రాష్ట్రస్థాయి సమావేశాన్ని శుక్రవారం హనుమకొండ హంటర్ రోడ్డులోని మాస్టర్ జీ డిగ్రీ& పీజీ కాలేజీ ఆడిటోరియంలో నిర్వహించారు.
ముఖ్యఅతిథిగా తెలంగాణ ఆస్తిత్వ వేదిక చైర్మన్ వి. ప్రకాష్, విశిష్ట అతిథి తెలంగాణ పొలిటికల్ జేఏసీ కన్వీనర్ కారం రవీందర్ రెడ్డి, అతిథులుగా సమన్వయకర్త శ్రీధర్ దేశ్ పాండే పాల్గొన్నారు. ముందుగా మహాత్మగాంధీ, ప్రొఫెసర్ జయశంకర్, నల్ల నరసింహులు చిత్రపటాలకు పూలమాలవేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ప్రజా కళాకారుడు, ఉపాధ్యాయ సాహితీవేత్త, జీవిత సాఫల్య పురస్కార గ్రహీత వల్లంపట్ల నాగేశ్వరరావును ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా తెలంగాణ అస్తిత్వ వేదిక చైర్మన్ ప్రకాష్ రావు మాట్లాడుతూ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో పాలన మనదే అయినా వెనుక ఉండి నడిపిస్తున్నది చంద్రబాబు నాయుడేనని, అందుకే రాష్ట్రానికి మళ్లీ కష్టాలు మొదలయ్యాయని అన్నారు. ఇదివరకు పాలనాపరంగా ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే సెక్రటేరియట్ లోనే అన్నీ జరిగిపోయేవని, కానీ ఇప్పుడు ఢిల్లీ నుంచో అమరావతి నుంచో అనుమతి తీసుకోవాల్సి వస్తోంద్నారు.
సమైక్య రాష్ట్రంలో, ఉద్యమ సమయంలో జరిగినట్లే ఇప్పుడు రాష్ట్రంలో జలదోపిడీ జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ నీళ్లను ఏపీకి తరలించుకుపోతున్నారని, గద్వాల పక్కనున్న జూరాల ప్రాజెక్టు నీళ్లను తెలంగాణ ప్రాంతానికి ఇవ్వాల్సిందిపోయి పోతిరెడ్డిపాడు ద్వారా నెల్లూరు జిల్లాలోని కండలేరు, సోమశిల ప్రాజెక్టులు నింపారన్నారు. చిత్తూరు, అనంతపురం, ఒంగోలు జిల్లాల్లోని రిజర్వాయర్లు నింపారన్నారు.
కోస్తా, రాయలసీమ ప్రాజెక్టులు నింపడానికి మహబూబూబ్ నగర్ నుంచి నీళ్లు తీసుకెళ్తుంటే.. పాలమూరు బిడ్డ, సీఎం రేవంత్ రెడ్డి ఒక్కమాట కూడా ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి అపరిపక్వత, అనుభవం లేమి, చంద్రబాబు ఆదేశాలను ఫాలో అవడం వల్ల తెలంగాణకు న్యాయం చేయలేకపోతున్నాడని అన్నారు. తెలంగాణ నుంచి వెళ్తున్న నీళ్లతో విజయవాడ, రాజమండ్రిలో బంగారు పంటలు పండుతుంటే, తెలంగాణలో మళ్లీ ఆత్మహత్యలు స్టార్ట్ అయ్యాయని స్పష్టం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లోనే తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకోవాలనే విషయం స్పష్టమవుతోందన్నారు.
మేడిగడ్డను పేల్చేశారని చెబితే ఎవరూ నమ్మలేదు
కాళ్వేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డను బాంబులతో పేల్చేశారని తాను చెబితే ఎవరూ నమ్మలేదని వి.ప్రకాష్ అన్నారు. 2024 జనవరిలో పెద్దపల్లి సమీపంలోని హుస్సేన్ మియా వాగుపై చెక్ డ్యాంలు పేల్చేస్తున్న కాంగ్రెస్ నాయకులను రైతులు రెడ్ హ్యాండెడ్ గా పట్టించారని, ఇంతవరకు దానిపై ఎలాంటి చర్యలు లేవన్నారు. 2026లో మానేరుపై రెండు బ్యారేజ్ లు పేల్చేశారని, సంబంధిత ఈఈ కూడా వాటిని పేల్చేశారని చెప్పినట్లు గుర్తు చేశారు.
వరంగల్ ఎయిర్ పోర్టుకు జయశంకర్ సార్ పేరు పెట్టాలని తెలంగాణ అస్తిత్వ వేదిక చైర్మన్ వి.ప్రకాష్ డిమాండ్ చేశారు. ఓబీసీ చైర్మన్, కుడా మాజీ చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ అస్తిత్వ వేదిక పోరాటం చేసే వ్యక్తులకు గురువులా ఉంటుందని, తెలంగాణ అస్తిత్వ పోరాటానికి ఓరుగల్లు నాయకత్వం వహించాలన్నారు.
తెలంగాణ అస్తిత్వం మళ్లీ ప్రశ్నార్థకంగా మారిందని, ప్రత్యేక రాష్ట్రం వచ్చినా అన్ని రంగాల అభివృద్ధి జరగలేదని అన్నారు. హైదరాబాద్ నడిబొడ్డున ఆంధ్రా పాలకులు, నేతల విగ్రహాలు పుట్టుకొస్తున్నాయని, అమరావతి నుండి ఆదేశాలు వస్తే, వాళ్ల విగ్రహాలు పెడుతున్నారన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి దమ్ముంటే గద్దర్, జయశంకర్ సార్ విగ్రహాన్ని విజయవాడలో పెట్టించాలని డిమాండ్ చేశారు. పాలకులు మనవాళ్ళయినా, నడిపించేది ఆంధ్రావాళ్లేనని విమర్శించారు. మన వనరులు మనమే కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.
వరంగల్ నుండే తెలంగాణ అస్తిత్వ పోరాటం మొదలవుతుందని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ అస్తిత్వ వేదిక రాష్ట్ర కన్వీనర్ పిట్టల రవీందర్, కారం రవీందర్ రెడ్డి, దేశ్ పాండే, ఓబిసి ప్రధాన కార్యదర్శి, ప్రొఫెసర్ గడ్డం భాస్కర్, సీనియర్ జర్నలిస్ట్ బుచ్చన్న, రాష్ట్ర గెజిటెడ్ వైస్ ప్రెసిడెంట్ జగన్ మోహన్ రావు, తెలంగాణ లెక్చరర్స్ ఫోరం రాష్ట్ర సలహాదారులు గంగాపురం వేణుమాధవ్, డాక్టర్ జేఏసీ నాయకులు నాగేంద్రబాబు, గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బోనగాని యాదగిరి గౌడ్, గుల్లపల్లి చిరంజీవి, వద్దిరాజు గణేష్, తాడిశెట్టి క్రాంతి, కొక్కొండ విజయబాబు,రాచకొండ ప్రవీణ్, డాక్టర్ శ్రీరామ్ శ్యామ్, డాక్టర్ పాలమాకుల కొమరయ్య, డాక్టర్ వోడితల రాము, రావుల రాజకుమార్, గుండేటి చక్రపాణి, తదితరులు పాల్గొన్నారు.