ఇది రాజ్యాంగ విజయం
దానం అనర్హతతో కాంగ్రెస్, బీఆర్ఎస్ బండారం బట్టబయలు
గతంలో వైఎస్, కేసీఆర్ కూడా చట్టాలను ఉల్లంఘించినవారే
కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి వ్యాఖ్య
హైదరాబాద్, సెప్టెంబర్ 19 (విజయక్రాంతి): ఎమ్మెల్యే దానం నాగేందర్(Danam Nagender) అనర్హుడని తెలంగాణ హైకోర్టు(Telangana High Court) ఇచ్చిన తీర్పు రాజ్యాంగ విజయ మని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి(Kishan Reddy) పేర్కొన్నారు. ఫిరాయింపుల రాజకీయాలకు పాల్పడుతున్న కాంగ్రె స్, బీఆర్ఎస్ పార్టీల బండారం బట్టబయలైందని ఆయన పేర్కొన్నారు. శనివారం హైదరాబా ద్‌లోని ఓ హోటల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడారు.
బరితెగించి చట్టాన్ని ఉల్లంఘించడం, పార్లమెంటు ఆమోదించిన చట్టాలను గౌరవించకపోవడం, తమ రాజకీయ అవసరాల కోసం వాటిని పూర్తిగా దుర్వినియోగం చేయడం ఇప్పటికైనా మానాలని హితవు పలికారు. పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో న్యాయస్థానం వెలువరించిన తీర్పు పట్ల యావత్ తెలంగాణ సమాజం, ప్రజలు అంతటా హర్షం వ్యక్తం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పుకు విరుద్ధంగా, ప్రజాభిప్రాయాన్ని పక్కనపెట్టి నాయకులను పార్టీలు మార్పించడం గత అనేక సంవత్సరాలుగా పరిపాటిగా మారిందని తెలిపారు.
గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ తరపున వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఇదే విధంగా ఫిరాయింపులను ప్రోత్సహించారని, ఆ తర్వాత బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక కేసీఆర్ కూడా అదే పద్ధతిలో చట్టాలను ఉల్లంఘించి కొనసాగారని గుర్తుచేశారు. నాడు కాంగ్రెస్ నుంచి గెలిచిన సబితా ఇంద్రారెడ్డిని కనీసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయించకుండానే బీఆర్ఎస్లో చేర్చుకుని మంత్రి పదవి ఇచ్చారని, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా అదే అడుగుజాడల్లో నడుస్తోందని విమర్శించారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఎన్నికై, చట్టానికి విరుద్ధంగా పార్టీ మారిన దానం నాగేందర్ అనర్హత పిటిషన్‌ను స్పీకర్ కొట్టివేయడాన్ని సవాలుచేస్తూ బీజేపీ తరపున రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించామని కిషన్‌రెడ్డి స్పష్టంచేశారు. ఇది పూర్తిగా చట్టవిరుద్ధమని, పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని ఉల్లంఘించడమేనని న్యాయస్థానం గుర్తించిందని తెలిపారు. స్పీకర్ నిర్ణయాన్ని పక్కనపెట్టిన హైకోర్టు.. దానం నాగేందర్ ఏ రోజైతే లోక్‌సభ ఎన్నికలకు నామినేషన్ వేశారో, ఆ రోజు నుంచే శాసనసభ్యుడిగా కొనసాగడానికి వీలు లేదని స్పష్టంచేస్తూ ఆయన సభ్యత్వాన్ని రద్దుచేయడం న్యాయమైన తీర్పు అని కొనియాడారు.
రాహుల్ సమాధానం చెప్పాలి..
ఢిల్లీ వేదికగా రాజ్యాంగ పుస్తకం పట్టుకుని ‘సంవిధాన్ బచావో’ అని తిరిగే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ తీరు పచ్చి బూటకమని కిషన్ రెడ్డి మండిపడ్డారు. అసెంబ్లీ రికార్డుల ప్రకారం దానం నాగేందర్ ఇంకా బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే ఉన్నారని తెలిసినప్పటికీ, కాంగ్రెస్ హైకమాండ్ ఆయనకు ఏ ప్రాతిపదికన ఎంపీ టికెట్ ఇచ్చిందో రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. హైకోర్టు తీర్పు పట్ల రాహుల్ గాంధీ స్పందన ఏమిటో తెలియజేయాలన్నారు.
గతంలో సీపీఐ, బీఎస్పీ సహా అనేక పార్టీలను చీల్చిన చరిత్ర కాంగ్రెస్‌దేనన్నారు. ఇలాంటి దుర్మార్గపు, రాజ్యాంగ వ్యతిరేక, అవినీతి పాలన పట్ల తెలంగాణ ప్రజలు తీవ్రంగా ఆలోచించాలని పిలుపునిచ్చారు. అప్పుడు కేటీఆర్ అనేక దుకాణాలు ఓపెన్ చేస్తే, ఇప్పుడు రేవంత్‌రెడ్డి కూడా అనేక దుకాణాలు ఓపెన్ చేసి వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపించారు. విచ్చలవిడిగా అప్పులు చేయడానికా, ఉన్న భూములు అమ్ముకోవడానికా, లిక్కర్ దందా పెంచడానికా, భూములు ఆక్రమించుకోవడానికా, కుటుంబ పాలన తెచ్చుకోవడానికా.. తెలంగాణను తెచ్చుకుందన్నారు.
అసెంబ్లీ ముందు డ్రామాలు..
అసెంబ్లీ ముందు ఒకరు బట్టలు ఇప్పుకోవడం, మరొకరు ఇప్పించడంలాంటి డ్రామాలు ఆడుతున్నారని ఎద్దేవా చేశారు. రేవంత్‌రెడ్డి అనేక అవినీతి ఆరోపణలు చేసినా ఏ ఒక్కదానిపైనా చర్యలు తీసుకోలేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కూలేశ్వరమైందని, లక్ష కోట్లు గోదావరిలో పోశారని అసెంబ్లీలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి.. అధికారంలో, పోలీసు వ్యవస్థ చేతిలో ఉన్నప్పటికీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు. రెవెన్యూ శాఖ పూర్తిగా అధ్వానంగా మారిందన్నారు.
కేసీఆర్ నోటికి ఏది వస్తే అది హామీలిచ్చి, విపరీతంగా అప్పులు చేసి, గ్రామాలలో మద్యం ఏరులై పారించి, ఒక చేత్తో సంక్షేమ పథకాలు ఇస్తూ మరో చేత్తో బీరు, బ్రాందీ పేరుతో ప్రజల కష్టార్జితాన్ని కొల్లగొట్టారని విమర్శించారు. అప్పట్లో ఎక్కడపడితే అక్కడ ప్రభుత్వ భూములు వేలం వేయడం, ధరణి పేరుతో సామాన్య ప్రజలను, రైతులను ఇబ్బంది పెట్టడం, హైదరాబాద్‌లో భూదందాలకు తెరలేపడం బీఆర్ఎస్ చేసిందని మండిపడ్డారు. నేడు కాంగ్రెస్ పార్టీ తీరు కూడా అలాగే ఉందన్నారు.
ఇద్దరు ముఖ్యమంత్రులు తమ తర్వాత తెలంగాణ ఉండొద్దు, పిల్లల భవిష్యత్తు ఉండొద్దు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని కిషన్ రెడ్డి ఆరోపించారు. భావి తరాల అవసరాల కోసం భూములను కాపాడాల్సిన బాధ్యతను విస్మరించి ఇప్పటికే హైదరాబాద్‌ను కాంక్రీట్ జంగిల్‌గా మార్చేశారని విమర్శించారు. అప్పట్లో కేసీఆర్ కుటుంబం, నేడు నెహ్రూ కుటుంబం.. అంతే తేడా అని, రెండు కూడా కుటుంబ పార్టీలేనని, ఫిరాయింపులను ప్రోత్సహించి చట్టాలకు తూట్లు పొడిచే పార్టీలేనని దుయ్యబట్టారు.
13 లక్షల ఉద్యోగాలు భర్తీ..
ఇప్పటివరకు జరిగిన 19 విడతల రోజ్‌గార్ మేళాల ద్వారా 12.50 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించగా, నేటి విడతతో ఆ సంఖ్య 13 లక్షలకు చేరిందని కిషన్ రెడ్డి వెల్లడించారు. రోజ్‌గార్ మేళాలో పాల్గొని కిషన్ రెడ్డి మాట్లాడారు. గత 12 ఏళ్లలో మోదీ ప్రభుత్వ విధానాల వల్ల దేశంలో స్టార్టప్‌ల సంఖ్య విపరీతంగా పెరిగిందని తెలిపారు. 2014కు ముందు వందల్లో ఉన్న స్టార్టప్‌లు, 2026 జూన్ నాటికి 2.3 లక్షలకు పైగా చేరుకున్నాయని, వీటి ద్వారా 23 లక్షలకు పైగా ప్రత్యక్ష ఉద్యోగాలని వెల్లడించారు.
మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా ఏఐ, రోబోటిక్స్, డ్రోన్ టెక్నాలజీ, గ్రీన్ ఎనర్జీ వంటి ఫ్యూచరిస్టిక్ రంగాల్లో నైపుణ్యాలు పెంపొందించుకోవాలని యువతకు సూచించారు. తాను బాధ్యతలు నిర్వహిస్తున్న బొగ్గు, గనుల రంగంలోనూ డిజిటలైజేషన్, ఆటోమేషన్, క్లీన్ కోల్ టెక్నాలజీల ద్వారా సరికొత్త అవకాశాలు వస్తున్నాయని, ఇంజనీరింగ్ యువత ఈ నూతన రంగాలను గమనించాలని కోరారు. నూతన ఉద్యోగులు తమ కుటుంబానికి, దేశానికి గర్వకారణంగా నిలవాలని ఆకాంక్షిస్తూ కిషన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.