విజిలెన్స్ దూకుడు!

20-09-2026 | 05:35am
  1. ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలల్లో తనిఖీలు ముమ్మరం
  2. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై స్పెషల్ ఫోకస్
  3. బోగస్ అడ్మిషన్లు, ఫ్యాకల్టీలు, తప్పుడు హాజరుపైనా నజర్
  4. ఇప్పటికే 50 కాలేజీల్లో తనిఖీలు పూర్తి
  5. తాజాగా వరంగల్, ఇబ్రహీంపట్నం పరిధిలో సోదాలు

హైదరాబాద్/మహబూబాబాద్, సెప్టెంబర్ 19 (విజయక్రాంతి): ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలపై(Private engineering college) విజిలెన్స్ బృందాలు(Vigilance teams) దూకుడు పెం చాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్(Fee Reimbursement) లెక్కలతో పాటు విద్యార్థులు, ఫ్యాకల్టీల హాజరు, వివరాలు, ల్యాబ్‌లు, మౌలిక సదుపాయాలను(Student and faculty attendance, details, laboratories, and infrastructure) నిశితంగా పరిశీలిస్తున్నాయి. హైదరాబాద్, వరంగల్ కేంద్రాలుగా ఇప్పటికే 50 కాలేజీల్లో తనిఖీలు పూర్తయ్యాయి. ఇంజినీరింగ్ కాలేజీలు అధికంగా ఉన్న జిల్లాల్లో తొలుత తనిఖీలు చేపట్టిన అధికారులు, అనంతరం ఇతర ప్రాంతాలపై దృష్టి సారించారు.

ఇందులో భాగంగా శనివారం ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఓ ప్రముఖ ఇంజినీరింగ్ కాలేజీలో విజిలెన్స్ అడిషనల్ ఎస్పీ శ్రీనివాస రావు ఆధ్వర్యంలో అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉపకార వేతనాల లెక్కల(Scholarship calculations)తో పాటు విద్యార్థుల అడ్మిషన్లు, టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది వివరాలు, ల్యాబ్, మౌలిక వసతులపై ఆరా తీశారు. ఇందుకు సంబంధించిన రికార్డులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. అదే విధంగా రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పరిధిలో గురునానక్ యూనివర్సిటీ, సీవీఆర్, శ్రీఇందు తదితర విద్యా సంస్థల్లోనూ విజిలెన్స్ బృందాలు తనిఖీలు నిర్వహించాయి.     

హాజరు నుంచి ఫీజు వరకు తనిఖీలు..

కాలేజీల్లో విద్యార్థుల హాజరు మొదలుకొని ఫీజు వరకు విజిలెన్స్ టీంలు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయి.  విద్యార్థుల అటెండెన్స్, ఫ్యాకల్టీ అటెండెన్స్, వేతనాలు, సర్టిఫికెట్లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ వివరాలు, అవకతవకలు, కంప్యూటర్ ల్యాబ్‌లు, ఆర్థిక లావాదేవీలు.. ఇలా 67 అంశాలపై నిశితంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం ఆయా కాలేజీలకు సంబంధించిన ఐదేళ్ల రికార్డులను అధికారులు తిరగేస్తున్నట్లు తెలిసింది. ఇబ్రహీంపట్నంలోని ఓ ప్రముఖ ఇంజినీరింగ్ కాలేజీలో మైనారిటీ విద్యార్థి నుంచి రూ.90 వేల ఫీజు వసూలు చేయడంతో పాటు, అదే విద్యార్థికి ప్రభుత్వం నుంచి రీయింబర్స్‌మెంట్ పొందినట్లు ఆరోపణలు ఉన్నాయి.

ఈ విషయం తెలుసుకున్న సదరు విద్యార్థి.. కళాశాల యాజమాన్యాన్ని ప్రశ్నించగా ఫీజు తిరిగిచ్చేది లేదని సమాధానం చెప్పినట్లు సమాచారం. మరికొన్ని కాలేజీల్లో విద్యార్థులు లేకపోయినా ఉన్నట్లు చూపించి  పీజు రీయింబర్స్‌మెంట్  పొందుతున్నట్లు ఆరోపణలున్నాయి. అలాగే సరిపడా ఫ్యాకల్టీలు లేకునా ఉన్నట్లు చూపించడం, వాస్తవానికి లేని ల్యాబ్‌లు, మౌలిక వసతులను చూపించి విద్యార్థుల నుంచి పెద్ద మొత్తంలో ఫీజు వసూలు చేస్తున్నారు. ఈక్రమంలోనే రికార్డుల్లోని వివరాలు, క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను సరిపోల్చి చూస్తున్నట్లు తెలిసింది.   

ఫీజు బకాయిలు రూ.10,991 కోట్ల పైనే..

ఇంటర్ నుంచి పీజీ, ప్రొషెషనల్ (వృత్తి విద్యా) కోర్సులకు సంబంధించిన ప్రైవేట్ విద్యా సంస్థలు రాష్ట్రంలో 2,500లకు పైగా ఉన్నాయి. ఆయా కాలేజీల్లో చదివే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో పాటు స్కాలర్‌షిప్ అందజేస్తుంది. వాస్తవంగా ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లను 3 నెలలకు ఒకసారి వాయిదాల పద్ధతిలో చెల్లించాల్సి ఉంది. కానీ, గత ప్రభుత్వం నుంచి ఈ ప్రభుత్వం వరకు సకాలంలో ఫీజు బకాయిలను చెల్లించడంలేదు.

మార్గదర్శకాల ప్రకారం విద్యాసంవత్సరం ప్రారంభంలో 25 శాతం ఫీజు రీయింబర్స్‌మెంట్, మధ్యలో 50 శాతం, చివరలో మరో 25 శాతం చెల్లించాల్సి ఉన్నది. కానీ ఆ విధానానికి పూర్తిగా పక్కనపెట్టారు. సంవత్సరానికి  ఒక సారి కూడా ఇవ్వడంలేదు. దీంతో రూ.10వేల కోట్లకు పైగా ఫీజు బకాయిలు పేరుకుపోయినట్లు కాలేజీలయాజమాన్యాలు చెబుతున్నాయి. 

ఇటీవల ఎస్సీ, ఎస్టీ సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మాత్రం 2025-26 విద్యాసంవత్సరం వరకు రూ. 8,591.62 కోట్లు మాత్రమే ఉన్నాయని వివరణ ఇచ్చారు. ప్రతి విద్యాసంవత్సరానికి ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు రూ. 2,200 కోట్ల నుంచి రూ. 2,400 కోట్ల వరకు అవసరం. దీనిప్రకారం చూసుకుంటే ఈ 2026-27 విద్యాసంవత్సరం కూడా కలుపుకుంటే రూ. 10,991.62 అవుతాయని కాలేజీల యాజమాన్యాలు, విద్యార్థి సంఘాలు పేర్కొంటున్నాయి.

ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ కాలేజీల్లోనూ..

విజిలెన్స్ తనిఖీలను ఇంజనీరింగ్ కళాశాలలతోనే ఆపకుండా ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ కాలేజీల్లో కూడా కొనసాగించనున్నారు. విజిలెన్స్ ఇచ్చే రిపోర్టు ఆధారంగా అక్రమాలకు పాల్పడిన కాలేజీలపై ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం ఉంది. తప్పు చేసిన కాలేజీలపై కేవలం ఫీజులు ఆపడమే కాకుండా, గుర్తింపు రద్దు, క్రిమినల్ కేసులు నమోదు చేసేటువంటి అంశాలను పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది.  

కఠినంగా వ్యవహరించాలి 

తనిఖీలకే పరిమితం చేయకుండా నిబంధనలు పాటించని, అక్రమాలు, అవకతవకలకు పాల్పడిన కాలేజీలపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలి. గత ప్రభుత్వం కూడా విజిలెన్స్‌తో తనిఖీలు  చేయించి చేతులు దులుపుకుంది. అలా కాకుండా ఈసారి కఠిన చర్యలు తీసుకోవాలి. తప్పులు వివరాలతో పెద్ద మొత్తంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ పొందడమే కాకుండా, అధ్యాపకులకు సరిగ్గా వేతనాలు కూడా ఇవ్వడం లేదు. అధ్యాపకుల బ్యాంకు ఖాతాల్లో  వేతనం జమ చేసి తిరిగి తీసుకుంటున్నారు. తనిఖీలు పారదర్శకంగా కొనసాగాలి. 

 అయినేని సంతోష్‌కుమార్, 

టీఎస్‌టీసీఈఏ రాష్ట్ర అధ్యక్షుడు 

మరిన్ని వార్తలు