క్షణాల్లో చేరుకుని.. ప్రాణం కాపాడిన కానిస్టేబుల్!

27-09-2026 | 02:38pm

కానిస్టేబుల్ శ్రీనివాస్‌ను అభినందించిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

కోరుట్ల/జగిత్యాల సెప్టెంబర్ 27(విజయ క్రాంతి):కుటుంబ కలహాలతో మనస్తాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన 23 ఏళ్ల యువకుడిని బ్లూకోట్స్ పోలీసులు(Blue Colts police) సకాలంలో స్పందించి ప్రాణాపాయం నుంచి కాపాడారు. కొడిమ్యాల మండలం దొంగలమర్రి చెక్‌పోస్ట్ సమీపంలో శంకర్రావుపేట గ్రామానికి చెందిన వంశీ కుటుంబ కలహాల కారణంగా పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు 112కు సమాచారం అందింది. సమాచారం అందుకున్న వెంటనే కొడిమ్యాల బ్లూకోట్స్ కానిస్టేబుల్ శ్రీనివాస్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిస్థితిని గమనించి యువకుడికి ధైర్యం చెప్పడంతో పాటు కుటుంబ సభ్యులతో మాట్లాడి కౌన్సెలింగ్ నిర్వహించారు. అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించి, అవసరమైన వైద్య సహాయం అందేలా చర్యలు చేపట్టారు.

సకాలంలో స్పందించడం అభినందనీయం ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్, ఐపీఎస్ మాట్లాడుతూ.. విధి నిర్వహణలో అప్రమత్తత, సమయస్ఫూర్తి, మానవత్వంతో స్పందించడం ప్రతి పోలీసు సిబ్బంది బాధ్యత అని అన్నారు. బ్లూకోట్స్ కానిస్టేబుల్ శ్రీనివాస్ వేగంగా స్పందించి విలువైన ప్రాణాన్ని కాపాడడం అభినందనీయమని కొనియాడారు.జీవితంలో ఎదురయ్యే కష్టాలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు లేదా వ్యక్తిగత ఒత్తిళ్లకు ఆత్మహత్య పరిష్కారం కాదని ఎస్పీ సూచించారు. సమస్యలు ఎదురైనప్పుడు ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోకుండా కుటుంబ సభ్యులు, స్నేహితులు లేదా నమ్మకమైన వ్యక్తులతో మాట్లాడాలని సూచించారు.

మరిన్ని వార్తలు