బిగ్ ట్విస్ట్.. ₹69 వేలా? ₹72 వేలా?
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్న 8వ కేంద్ర వేతన సంఘం(8th Pay Commission Salary Hike) ప్రక్రియలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఉద్యోగ సంఘాలు, పెన్షనర్ల ప్రతినిధులతో సంప్రదింపులు కొనసాగుతున్న నేపథ్యంలో జీతాలు, ఫిట్మెంట్ ఫ్యాక్టర్, వార్షిక ఇంక్రిమెంట్లు, పెన్షన్ వంటి అంశాలపై పలు ప్రతిపాదనలు తెరపైకి వచ్చాయి.
రూ.69,000 కనీస వేతనం.. 3.833 ఫిట్మెంట్
NC-JCM స్టాఫ్ సైడ్ 8వ(8th Pay Commission) వేతన సంఘం ముందు తన ప్రతిపాదనల్లో కనీస ప్రాథమిక వేతనాన్నిరూ.69,000కు పెంచాలని, అలాగే 3.833 ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పరిగణనలోకి తీసుకోవాలని కోరింది. వార్షిక ఇంక్రిమెంట్‌ను 6 శాతానికి పెంచాలని కూడా ప్రతిపాదించింది.
BPMS డిమాండ్ ఇంకా ఎక్కువ
మరోవైపు భారతీయ ప్రతిరక్షా మజ్దూర్ సంఘ్ (BPMS) కనీస ప్రాథమిక వేతనం రూ.72,000, 4.0(₹72000 Minimum Salary) ఫిట్మెంట్ ఫ్యాక్టర్ కోరింది. వార్షిక ఇంక్రిమెంట్‌ను 3 శాతం నుంచి 6 శాతానికి పెంచాలని కూడా ప్రతిపాదించింది.
పెన్షన్‌పైనా కీలక ప్రతిపాదనలు
NC-JCM పెన్షనర్లకు కూడా పలు మార్పులను ప్రతిపాదించింది. ఉద్యోగులు, పెన్షనర్లకు(8th Pay Commission Pension) ఒకే ఫిట్మెంట్ ఫ్యాక్టర్, పెన్షన్ ప్రయోజనాల్లో మార్పులు, గ్రాట్యుటీ పరిమితి పెంపు, పెన్షన్ కమ్యూటేషన్ వ్యవధి తగ్గింపు వంటి అంశాలను తన మెమొరాండంలో ప్రస్తావించింది. అయితే ఇవన్నీ ఉద్యోగ సంఘం చేసిన డిమాండ్లు మాత్రమే; 8వ వేతన సంఘం తుది సిఫార్సులుగా పరిగణించకూడదు.
ఇంకా ఏం జరుగుతోంది?
8వ కేంద్ర వేతన సంఘం ఉద్యోగులు, పెన్షనర్లు, సంఘాలు, యూనియన్లు సహా వివిధ వర్గాల నుంచి అభిప్రాయాలు, ప్రతిపాదనలు స్వీకరిస్తోంది. అధికారికంగా 8వ వేతన సంఘాన్ని 2025 నవంబర్ 3న ఏర్పాటు చేశారు. 2026లో పలు రాష్ట్రాలు, నగరాల్లో సంఘాలతో సమావేశాలు నిర్వహిస్తూ అభిప్రాయాలను సేకరిస్తోంది. అందువల్ల ప్రస్తుతం చర్చలో ఉన్న రూ.69,000, రూ.72,000 కనీస వేతనాలు లేదా 3.833, 4.0 ఫిట్మెంట్ ఫ్యాక్టర్లు తుది నిర్ణయాలు కావు. వేతన సంఘం సిఫార్సులు, ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఆధారంగానే ఉద్యోగులు, పెన్షనర్లకు తుది ప్రయోజనాలు ఖరారవుతాయి.