బాలల రక్షణపై అవగాహనతోనే సురక్షిత సమాజం
సీనియర్ సివిల్ జడ్జి, తాడూరు మహతి వైష్ణవి
సురక్షిత్ బచ్పన్ అభియాన్‌లో భాగంగా పాఠశాలల్లో అవగాహన
గణపురం, అక్టోబర్ 27 (విజయక్రాంతి): బాలల రక్షణపై అవగాహనతోనే సురక్షిత సమాజమని సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి తాడూరు మహతి వైష్ణవి అన్నారు. జాతీయ, తెలంగాణ రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థల ఆదేశాలతో ‘సురక్షిత్ బచ్పన్ అభియాన్’లో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం జిల్లాలోని వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో బాలల పరిరక్షణపై అవగాహన(Child Protection Awareness) కార్యక్రమాలు నిర్వహించారు.
గణపురం మండలం గాంధీనగర్ మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ గురుకుల పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమానికి సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి తాడూరు మహతి వైష్ణవి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దేశ బంగారు భవిష్యత్తు నేటి బాలల పరిరక్షణతోనే సాధ్యమవుతుందని అన్నారు. పోక్సో నేరాల నివారణతో పాటు సైబర్ మోసాల నుంచి పిల్లలను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచే బాలల హక్కులు, రక్షణ చర్యలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు.
ఆధునిక కాలంలో మొబైల్ ఫోన్ వినియోగంపై అప్రమత్తంగా ఉండాలని, మొబైల్‌ను జాగ్రత్తగా ఉపయోగించడం అలవాటు చేసుకోవాలని సూచించారు.చెల్పూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరిగిన మరో కార్యక్రమానికి అదనపు జూనియర్ సివిల్ జడ్జి జి. అఖిల ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రతి బిడ్డ బాల్యం మనందరి బాధ్యత అని అన్నారు. చాలా మంది పిల్లలకు తమ హక్కులు, అవసరమైన సమయంలో సహాయం ఎలా పొందాలో తెలియదని, ఈ అవగాహన కల్పించడమే సురక్షిత్ బచ్పన్ అభియాన్ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాల్లో జిల్లా బాలల పరిరక్షణ అధికారి వెంకటస్వామి, సూపరింటెండెంట్ రఘురాం, గణపురం ఎస్ఐ బొరగల అశోక్, ఎంజెపి ప్రిన్సిపాల్ స్వప్న, న్యాయసేవాధికార సంస్థ సిబ్బంది అంబాల దేవేందర్, గోపాల్, రాజ్‌కుమార్, విద్యార్థులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.