మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ రాస్తారోకో...
- ప్రధాని తండ్రిపై అనుచిత వ్యాఖ్యలు దురదృష్టకరం
- బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి
కొత్తగూడెం అక్టోబర్ 27 విజయక్రాంతి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భారతీయ జనతా పార్టీ(Bharatiya Janata Party) అధ్యక్షులు శ్రీ బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో , మంగళవారం లక్ష్మీదేవిపల్లి మండలంలోని ముర్రేడు బ్రిడ్జి వద్ద కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు ఖర్గే చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఆందోళన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి తమ నిరసనను వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తండ్రిపై కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే అనుచిత వ్యాఖ్యలు చేయడం అత్యంత దురదృష్టకరమని అన్నారు. జాతీయ స్థాయి బాధ్యతల్లో ఉన్న నాయకులు వ్యక్తిగత విమర్శలకు దిగడం సరైన పద్ధతి కాదని, ఇలాంటి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు.
భారతీయ జనతా పార్టీ విజయాలు సాధిస్తూ ముందుకు సాగుతుండటాన్ని కాంగ్రెస్ పార్టీ జీర్ణించుకోలేక తీవ్ర అసహనానికి గురవుతోందని విమర్శించారు. ప్రజల విశ్వాసాన్ని కోల్పోతున్న కాంగ్రెస్ పార్టీ, తన రాజకీయ వైఖరిలో మార్పు తెచ్చుకోకపోతే ప్రస్తుతం అధికారంలో ఉన్న మూడు రాష్ట్రాల్లోనూ రాబోయే రోజుల్లో ప్రజల తిరస్కరణను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
ప్రధాని పై ,కుటుంబ సభ్యులపై ఇలాంటి అనుచిత వ్యాఖ్యలకు పాల్పడటం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే ఇలాంటి వ్యాఖ్యలను పునరావృతం చేయకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు.
భవిష్యత్తులో ఇలాంటి చర్యలకు పాల్పడితే భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తల నుంచి ప్రజాస్వామ్య పద్ధతుల్లో తీవ్ర ప్రతిఘటన ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.అనంతరం బీజేపీ నాయకులు, కార్యకర్తలు ముర్రేడు బ్రిడ్జి వద్ద రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ జాటోత్ వెంకన్న నాయక్,
జిల్లా ఉపాధ్యక్షురాలు భూక్య దివ్యశ్రీ, జిల్లా కార్యదర్శి పుణ్య నాయక్, యువ మోర్చా జిల్లా అధ్యక్షులు జుజ్జూరు మోహన్ కృష్ణ, లక్ష్మీదేవిపల్లి మండల అధ్యక్షులు నవీన్, చంద్రుగొండ మండల అధ్యక్షులు రఘుపతి, ములకలపల్లి మండల అధ్యక్షులు శంకర్, టేకులపల్లి మండల అధ్యక్షులు శంభు నాయక్, పాల్వంచ టౌన్ అధ్యక్షులు రాపాక రమేష్, ఎస్టీ మోర్చా అధ్యక్షురాలు భూక్య స్వాతి,
ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షులు బడే, మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి మువ్వ అపర్ణ, యువ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి కోల హరీష్, సీనియర్ నాయకులు పైడిపాటి రవీందర్, పొనగంటి రాజు, సతీష్, మహంకాళి శంకర్ తదితరులు పాల్గొన్నారు.