రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందించాలి
పంపిణీలో పారదర్శకత పాటించాలి : జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ
మహాముత్తారం,(విజయక్రాంతి): రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులను సరసమైన ధరలకు అందించడంతో పాటు పంపిణీలో పూర్తి పారదర్శకత పాటించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ(Collector Rahul Sharma) అధికారులను ఆదేశించారు. గురువారం మహాముత్తారం మండల కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం(Primary Agricultural Cooperative Credit Society) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల విక్రయ కేంద్రాన్ని కలెక్టర్ ప్రారంభించారు. అనంతరం ఆన్‌లైన్ బిల్లింగ్ విధానం, నిల్వల రిజిస్టర్లు, డిజిటల్ సేవలను పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... జిల్లాలో తొలిసారిగా పీఏసీఎస్ ద్వారా పురుగుమందులు విత్తనాల విక్రయ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రైతులను యాప్‌లో నమోదు చేసి విక్రయాలు నిర్వహిస్తామని, కొనుగోలు అనంతరం బిల్లులు, రసీదులు నేరుగా వారి వాట్సాప్‌కు పంపడం ద్వారా పారదర్శకత, జవాబుదారీతనం పెరుగుతుందని అన్నారు. మహాముత్తారం, పలిమెల రైతులకు ఇబ్బందులు లేకుండా కాటారం నుంచి విత్తనాలు, ఎరువుల సరఫరా జరిగేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, సహకార అధికారి వాలియా నాయక్, వ్యవసాయ శాఖ ఏడీఏ శ్రీపాల్, ఎంపీడీఓ నిశాంత్, పీఏసీఎస్ సీఈఓ, డైరెక్టర్లు, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.