అసెంబ్లీలో రేవంత్ పచ్చి అబద్ధాలు మాట్లాడిండు
నకిలీ అకౌంట్లను నడిపేది కాంగ్రెస్ పార్టీ
సీఎంకు నోటీసు ఇస్తాం
హైదరాబాద్: ప్రజాసమస్యలపై చర్చకు ప్రభుత్వం సిద్దంగా లేదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు(Siddipet MLA Harish Rao) ఆరోపించారు. సమాధానం చెప్పలేక తమను సభ నుంచి సస్పెండ్ చేశారని ధ్వజమెత్తారు. 22ఏ పై రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ ప్రజా పోరాటాలు చేసిందని తెలిపారు. ప్రభుత్వాన్ని నిలదీసి బాధితులకు న్యాయం చేసేందుకు సిద్ధం కావాలని నేతలకు పిలుపునిచ్చారు. ఫీజు రీయింబర్స్మెంట్(Fee Reimbursement) చేయకుండా 30 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని ఫైర్ అయ్యారు. ఉద్యోగాలు వచ్చినా సర్టిఫికెట్లు దొరక్క అవకాశాలు కోల్పోతున్నారని మండిపడ్డారు. ఫీజు రీయింబర్స్ మెంట్ చేయనందున విదేశీ విద్య అవకాశాలు కోల్పోతున్నారని చెప్పారు. అన్ని ఆధారాలతో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. చర్చలకు సిద్ధమైతే సెషన్ మొత్తం సస్పెన్షన్ దుర్మార్గం అన్నారు.
మహిళా ఎమ్మెల్యేలపై దాడి(Attack on women MLAs) జరిగితే కప్పిపుచ్చుకునేందుకు తమపై కేసులు పెట్టారని తెలిపారు. మగ ఎమ్మెల్యేలు చుట్టూ మహిళా పోలీసులను, మహిళా ఎమ్మెల్యేల చుట్టూ మగ పోలీసులను పెట్టారని విమర్శించారు. తమను నిర్బంధించే ప్రయత్నం చేసి తమపైనే కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక అన్ని అంశాలపై విచారణ జరుపుతామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ నేతల(Congress leaders) అవినీతి, అక్రమ కేసులు పెట్టిన అధికారులపైనా విచారణ చేస్తామన్నారు. సమస్యలపై చర్చ జరగకుండా సీఎం రేవంత్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే విపక్షాలకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. మహిళా ఎమ్మెల్యేలపై దాడి జరిగితే వారికి మాట్లాడే అవకాశం ఇవ్వలేదన్నారు.
ప్రతిపక్షంగా బీఆర్ఎస్ కు మైకు ఇవ్వకపోవడం ప్రజాపక్షం కాదు..ఏకపక్షం అన్న హరీశ్ రావు శాసనసభలో తమ గొంతు కాదు.. ప్రజల గొంతు నొక్కుతున్నారని మండిపడ్డారు. సస్పెండ్ చేసిన మా పోరాటం కొనసాగుతోందని హరీశ్ రావు స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన నకిలీ అకౌంట్ల నుంచే ఫేక్ పోస్టులు పెట్టించి, వాటి ఆధారంగా అసెంబ్లీలో రేవంత్ రెడ్డి పచ్చి అబద్ధాలు మాట్లాడిండని హరీశ్ రావు ఆరోపించారు. కాంగ్రెస్ నడిపే ఫేక్ అకౌంట్లపై(Congress fake accounts) అసెంబ్లీలో సీఎం మాట్లాడడం దౌర్భాగ్య పరిస్థితి అన్నారు.
కాంగ్రెస్ నడిపే ఫేక్ అకౌంట్లపై ఫిర్యాదు చేస్తామన్నారు. నకిలీ అకౌంట్ ఆధారంగా అసెంబ్లీని తప్పుదోవ పట్టించిన సీఎం క్షమాపణ చెప్పాలన్నారు. నకిలీ అకౌంట్లపై విచారణ చేసి నిందితులను అరెస్టు చేయాలని కోరారు. సీఎంపై సభా హక్కుల ఉల్లంఘన కింద నోటీసు ఇస్తామని హరీశ్ రావు తెలిపారు. కాగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన తమ్ముడు కొండల్ రెడ్డి టెస్సెరాక్ట్ కంపెనీకి ఫోర్త్ సిటీలో అక్రమంగా కట్టబెట్టిందని బీఆర్ఎస్(Bharat Rashtra Samithi) ఆరోపించింది. కోట్ల విలువైన ప్రభుత్వ భూమి వద్దకు చేరుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు నేతృత్వంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం పరిశీలించింది.