ఈవీఎం, వీవీ పాట్ గోదామును తనిఖీ చేసిన కలెక్టర్ రాహుల్ శర్మ
భూపాలపల్లి టౌన్,(విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా(Jayashankar Bhupalpally District) ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ శర్మ బుధవారం జిల్లా కేంద్రంలోని ఈవీఎం, వీవీ పాట్ గోదామును తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గోదాంలో భద్రపరిచిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు, వీవీ పాట్ యంత్రాల భద్రతను పరిశీలించారు. గోదాంలో భద్రతా చర్యలు, సీసీటీవీ పర్యవేక్షణ, అగ్ని మాపక పరికరాలు, డబుల్ లాక్ సిస్టమ్ తదితర అంశాలను కలెక్టర్ పరిశీలించారు. అలాగే, యంత్రాల నిర్వహణ రికార్డులు, స్ట్రాంగ్ రూమ్ రిజిస్టర్లను తనిఖీ చేసి, ఎన్నికల సంఘం సూచించిన నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని ఆదేశించారు. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత, నిష్పాక్షికత కోసం ఈవీఎం, వీవీ పాట్ ల భద్రత అత్యంత కీలకమని తెలిపారు. అనంతరం తనిఖీ రిజిస్టర్ లో సంతకాలు చేసి రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో సీల్ వేశారు. ఈ తనిఖీలో ఎన్నికల విభాగం డీటి అబ్బాస్, నవీన్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.