పండుగ సాయన్న జీవితం నేటి తరానికి ఆదర్శం

22-10-2026 | 05:54pm

భూపాలపల్లి టౌన్, అక్టోబర్ 22 (విజయక్రాంతి): తెలంగాణ రాబిన్‌హుడ్‌గా (Robin Hood) ప్రసిద్ధి చెందిన పండుగ సాయన్న జీవితం నేటి తరానికి ఆదర్శమని జయశంకర్ భూపాలపల్లి జిల్లా అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ అన్నారు. గురువారం జిల్లా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఐడీఓసీ (IDOC) కార్యాలయంలో పండుగ సాయన్న ముదిరాజ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అదనపు కలెక్టర్ సాయన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా అశోక్ కుమార్ మాట్లాడుతూ.. బడుగు, బలహీన వర్గాలపై జరుగుతున్న దోపిడీని, భూస్వాముల పెత్తనాన్ని ఎదిరిస్తూ పేద ప్రజల పక్షాన నిలిచిన పోరాట యోధుడు (Fighter) పండుగ సాయన్న అని కొనియాడారు. సమాజంలో నెలకొన్న అన్యాయాలు, అసమానతలను ప్రశ్నిస్తూ పేదల ఆకలి తీర్చడం, నిరుపేద కుటుంబాలకు అండగా నిలవడం ద్వారా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని తెలిపారు..

సమాజంలో సమానత్వం, సామాజిక న్యాయం (Social Justice) సాధనతో పాటు పేదల అభ్యున్నతికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అదనపు కలెక్టర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన సర్వీసుల శాఖ అధికారి చిర్ర రఘు, జిల్లా ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు ఆకుల సుభాష్, జిల్లా మత్స్య శాఖ అధ్యక్షుడు జోరుక సదయ్య, శ్రీనివాస్, సుధాకర్, రవీందర్, గోపాల్, శ్రీధర్, మల్లయ్య, మద్దెల విజయ, బీమానాథుని సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని వార్తలు