జలాశయాల నీటిని పొదుపుగా వినియోగించుకోవాలి
యాసంగిలో వరి సాగుకు దూరంగా ఉండాలి – కలెక్టర్ ఇలా త్రిపాఠి
బోధన్,(విజయక్రాంతి): జలాశయాల్లో అందుబాటులో ఉన్న నీటిని జాగ్రత్తగా, పొదుపుగా వినియోగించుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి(Collector Ila Tripathi) సూచించారు. యాసంగి సీజన్‌లో వరి సాగుకు అవసరమైన నీటి సరఫరా అందుబాటులో ఉండే అవకాశం లేదని, ఈ నేపథ్యంలో రైతులు(Farmers) వరి సాగు చేయకుండా ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపేలా గ్రామాల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. తక్కువ నీటితో సాగు చేయగలిగే, స్వల్ప వ్యవధిలోనే దిగుబడులు అందించే ప్రత్యామ్నాయ పంటలను రైతులకు పరిచయం చేయాలని సూచించారు.
నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకొని పంటల ఎంపిక చేసుకునేలా రైతులకు వ్యవసాయ శాఖ అధికారులు సలహాలు అందించాలన్నారు. నీటి వనరులను సమర్థవంతంగా వినియోగించుకుంటూ సాగు చేపట్టే విధంగా రైతులకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ, ఉద్యానవన శాఖల అధికారులు పాల్గొన్నారు.