పోలీసుల కార్డెన్ సెర్చ్.. అక్రమాలపై నిఘా!
మహాముత్తారం, అక్టోబర్ 8 (విజయ క్రాంతి): మహాముత్తారం మండలం కనుకునూర్ గ్రామంలో మహాముత్తారం ఎస్‌ఐ జి. రమేష్ ఆధ్వర్యంలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్(Cordon and Search Operation) నిర్వహించారు. గురువారం ఉదయం అడవిముత్తారం పోలీస్ స్టేషన్ పరిధిలోని కనుకునూర్ గ్రామంలో పీజీఎస్‌పీ సిబ్బందితో కలిసి కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు.
ఈ సందర్భంగా గ్రామంలో అనుమానాస్పద వ్యక్తులు, అక్రమ కార్యకలాపాలపై తనిఖీలు నిర్వహించారు. అలాగే గ్రామ ప్రజలకు గుడుంబా, గంజాయి వినియోగం, అక్రమ రవాణా వల్ల కలిగే నష్టాలు, సైబర్ నేరాల(Cyber Crimes) పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. యువకులు ఉన్నత చదువులు చదివి గ్రామానికి, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకువచ్చేలా కృషి చేయాలని, చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు.
ప్రజలు ఎటువంటి అనుమానాస్పద కార్యకలాపాలు కనిపించినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని పోలీసులు తెలిపారు. గ్రామంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. కార్యక్రమంలో గ్రామ ప్రజలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.