జగ్గారెడ్డి తగ్గేదేలే!.. ఢిల్లీలో పోరాటం సంగారెడ్డిలోకి

08-10-2026 | 07:30am

రాహుల్‌ గాంధీ పోరాటానికి జగ్గారెడ్డి మద్దతు.. సంగారెడ్డిలో దీక్ష

సంగారెడ్డి: దేశ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారిన ఓటు హక్కు, ఎన్నికల వ్యవస్థ అంశాలపై కాంగ్రెస్‌ చేపట్టిన ఆందోళన తెలంగాణలోనూ కొనసాగుతోంది. ఢిల్లీలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ సహా కాంగ్రెస్‌ నేతలు చేస్తున్న నిరసనలకు మద్దతుగా టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి సంగారెడ్డిలో దీక్షకు దిగారు. ఓల్డ్‌ బస్టాండ్‌ సమీపంలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ విగ్రహం వద్ద కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆయన నిరసన చేపట్టారు.

కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ (CEC) జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలని రాహుల్‌ గాంధీ చేస్తున్న పోరాటానికి సంఘీభావంగా ఈ దీక్ష చేపట్టినట్లు జగ్గారెడ్డి తెలిపారు. SIR, ఓటర్ల జాబితా, ఓటు హక్కు పరిరక్షణ అంశాలపై కాంగ్రెస్‌ లేవనెత్తుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. రాహుల్‌ గాంధీ ఢిల్లీలో ఎంతకాలం నిరసన కొనసాగిస్తే.. అంతకాలం సంగారెడ్డిలోనూ తన దీక్ష కొనసాగుతుందని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. ‘‘ఇది కేవలం కాంగ్రెస్‌ పార్టీ రాజకీయ పోరాటం కాదు.. దేశ ప్రజల ఓటు హక్కును కాపాడే పోరాటం’’ అని జగ్గారెడ్డి పేర్కొన్నారు. ఎన్నికల వ్యవస్థపై ప్రజల్లో తలెత్తుతున్న అనుమానాలకు ఎన్నికల సంఘం స్పష్టత ఇవ్వాలని ఆయన కోరారు. రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు ఇండియా కూటమి నేతలు ఢిల్లీలో చేస్తున్న నిరసనకు తెలంగాణ నుంచి కూడా బలమైన మద్దతు ఉంటుందని జగ్గారెడ్డి తెలిపారు.

మరిన్ని వార్తలు