సర్కారు కాలేజీల్లో సీన్ మారనుందా!
తెలంగాణలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యా ప్రమాణాలను మరింత పెంచడంతో పాటు మౌలిక వసతులను మెరుగుపరిచేందుకు ఇంటర్ బోర్డు కీలక చర్యలకు శ్రీకారం చుట్టింది. విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించడమే లక్ష్యంగా ఇంటర్ బోర్డు కార్యదర్శి, జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారులు (DIEOs), ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్లతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.
ఈ సమావేశంలో బోధనా పద్ధతులు, కళాశాలల పరిపాలన, విద్యార్థుల సంక్షేమం, మౌలిక సదుపాయాలపై విస్తృతంగా చర్చించారు. ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులకు అప్‌డేట్ చేసిన నూతన సిలబస్‌ను సమర్థవంతంగా బోధించాలని, సవరించిన ప్రాక్టికల్ పరీక్షల విధానాన్ని కచ్చితంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. అధ్యాపకుల బోధనా నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు ప్రత్యేక ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌లు(Faculty Development Programs) నిర్వహించాలని సూచించారు.
ఫేషియల్ రికగ్నిషన్ హాజరు.. RO ప్లాంట్లు తప్పనిసరి
విద్యార్థుల హాజరు నమోదులో పారదర్శకత తీసుకురావడంపై ఇంటర్ బోర్డు ప్రత్యేక దృష్టి సారించింది. అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ (FRS) నమోదును వెంటనే పూర్తి చేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో తాగునీటి కోసం RO ప్లాంట్లను ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే కళాశాల భవనాల మరమ్మతులు, ఇతర మౌలిక వసతుల పనులను తెలంగాణ విద్యా సంక్షేమ మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ (TGEWIDC) సహకారంతో వేగవంతం చేయాలని ఆదేశించారు.
మధ్యాహ్న భోజనంపై ప్రత్యేక సమీక్ష
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో అమలవుతున్న అల్పాహారం, మధ్యాహ్న భోజన పథకాల అమలుపైనా అధికారులు సమీక్షించారు. విద్యార్థుల సంక్షేమ కార్యక్రమాలకు అందుబాటులో ఉన్న సమగ్ర శిక్షా అభియాన్ నిధులను సమర్థవంతంగా వినియోగించాలని నిర్ణయించారు.
ఇన్నోవేషన్ హ్యాకథాన్‌పై ఆరా
ఇంటర్ విద్యార్థుల్లో పరిశోధనాత్మక ఆలోచనలు, సమస్య పరిష్కార నైపుణ్యాలను పెంపొందించేందుకు నిర్వహిస్తున్న 15 రోజుల తెలంగాణ ఇన్నోవేషన్ హ్యాకథాన్(Telangana Innovation Hackathon) పురోగతిని కూడా సమావేశంలో సమీక్షించారు. విద్యా ప్రమాణాల పెంపుతో పాటు హాజరు వ్యవస్థలో పారదర్శకత, తాగునీరు, మౌలిక వసతులు, విద్యార్థుల సంక్షేమం, అధ్యాపకుల నైపుణ్యాభివృద్ధిపై ఇంటర్ బోర్డు తీసుకుంటున్న చర్యలు.. ప్రభుత్వ జూనియర్ కళాశాలలను మరింత బలోపేతం చేసే దిశగా కీలకంగా మారనున్నాయి. విద్యార్థులకు మెరుగైన వాతావరణం(Learning Environment) కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. కళాశాలల్లో విద్యా నాణ్యతను పెంచేందుకు నాణ్యత మెరుగుదల(Quality Improvement)పై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు.